Trending: బీహార్(Bihar) ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన పని ఒకటి సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర మహిళలకు ఉచిత శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. అయితే, పంపిణీ చేసిన ప్యాడ్స్ కవర్లపై రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ నేతల ఫొటోలు ప్రింట్ చేశారు. ఇంటికెళ్లి ఓపెన్ చేసి చూస్తూ లోపల ఉన్న ప్యాడ్ల మీద కూడా రాహుల్ గాంధీ ముఖాన్ని ప్రింట్ చేయడంతో షాక్ అవడం అక్కడి మహిళల వంతైంది. ఇది ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.
బీహార్ శాసనసభలో ప్రస్తుతం కొనసాగుతున్న 17వ టర్మ్ నవంబరు 22తో ముగుస్తుంది. అయితే, దీనికి నెల, రెండు నెలల ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక షెడ్యూలు విడుదల అవకపోయినా.. ఎన్నికల సెగలు రేగుతున్నాయి. ప్రధాన పోటీదారులుగా ఎన్డీయే NDA (బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్), ఎల్‌జేపీ) మూడు పార్టీల కూటమి, మహాఘట్‌బంధన్ (ఇండియా కూటమి)లో ఆర్‌జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పోటీలో ఉండబోతున్నాయి. బీహార్‌లో కీలకమైన మైనారిటీ ఓట్లను ప్రభావితం చేసే AIMIM తరఫున ఆ పార్టీ అధినేత ఒవైసీ INDIA కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఆయన స్వంతత్రంగానే బరిలోకి దిగుతారని తెలుస్తోంది.
ఇప్పటికే ABP‑C Voter, Superbo‑Poll వంటి సర్వేలు NDA కి 114–137 సీట్లు అంచనా వేస్తుండగా.. కాంగ్రెస్, ఆర్‌జేడీతో ఉన్న ప్రతిపక్ష మహాఘట్ బంధన్‌కు 101–123 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉండగా.. నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీయేకే గెలుపు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీన్ని మార్చేందుకు అటు కాంగ్రెస్, ఇటు ఆర్జేడీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్నికల సంఘం ఇటీవల విడుద చేసిన ఓటర్ల జాబితాలో తప్పుడు ఓట్లున్నాయని.. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం తొత్తుగా మారిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు ఈనెల 9న బీహార్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఈవీఎంలపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇన్‌డియా కూటమి నేతలు పంపిణీ చేసిన శానిటరీ ప్యాడ్లు(Sanitary Pads) బీహార్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారాయి. దీనిపై దేశవ్యాప్తంగా మహిళా సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. ఇదే అవకాశంగా బీజేపీ సోషల్ మీడియా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తోంది. బీజేపీ కేంద్ర మంత్రులు సైతం దీనిపై తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. తొలుత అది ఫేక్ ప్రచారమంటూ కాంగ్రెస్ ఐటీ సెల్ ఈ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసినా.. బీజేపీ ఐటీసెల్ దానికి బదులుగా పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు, మహిళలు తీసిన వీడియోలను జత చేస్తున్నారు. ఏది ఏమైనా ఇరుపక్షాలకు కీలకమైన ఈ ఎన్నికల్లో ఇంకా ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో అనుకుంటున్నారు జనం.