HMDA హైదరాబాద్: హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పూర్వ ప్రణాళికాధికారి శివ బాలకృష్ణ, ఆయన సోదరుడు నవీన్ కుమార్ అక్రమాస్తుల వ్యవహారాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ (ACB) దర్యాప్తు జరుపుతుండగా… తాజాగా బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు వీరి నివాసాలపై విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
ఈడీ అధికారులు చైతన్యనగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో శివ బాలకృష్ణ, నవీన్ కుమార్ నివాసాల్లో ఒకేసారి దాడులు చేశారు. ఈ సోదాల సందర్భంగా అధికారులు వివిధ కీలకమైన ఆస్తుల సంబంధిత దస్త్రాలు, డిజిటల్ డివైజ్‌లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసు మేరకు, ఈడీ ECIR (Enforcement Case Information Report) నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. గతంలో ఏసీబీ దాడుల సమయంలో శివ బాలకృష్ణకు రూ.250 కోట్లకు పైగా విలువైన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 200 ఎకరాల వ్యవసాయ భూములు, ఇల్లు, విల్లాలు, ఇతర విలువైన భవనాలు, స్థలాలు ఉండగా… వీటి మార్కెట్ విలువ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ అక్రమాస్తుల వ్యవహారంలో ఇప్పటికే శివ బాలకృష్ణతో పాటు అతని సోదరుడు నవీన్‌ను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది. అంతేకాదు, శివ బాలకృష్ణ పేరిట కొనుగోలు చేసిన ఆస్తుల్లో ముగ్గురు బినామీలు, అతడి సన్నిహిత బంధువులు కూడా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వారిని కూడా ACB ఇప్పటికే అరెస్ట్ చేసింది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న శివ బాలకృష్ణ, నవీన్‌ల నివాసాల్లో తాజాగా ఈడీ అధికారులు జరిపిన సోదాలు ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చాయి.
ఈడీ దాడులతో కేసులో మరోసారి తీవ్రత పెరగగా, అక్రమంగా కూడబెట్టిన ఆస్తులకు సంబంధించి పూర్తి ఆర్థిక లావాదేవీలను లోతుగా విశ్లేషిస్తున్నారు అధికారులు. బ్యాంక్ ఖాతాలు, రియల్ ఎస్టేట్ డీల్‌లు, ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ వివరాలపై కూపీ లాగుతున్నట్లు సమాచారం.
ఈ కేసు ఈడీ ఎంట్రీతో మరోసారి అగ్గి రాజుకోవడంతో.. రాజకీయ, అధికారవర్గాల్లో చర్చ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో శివ బాలకృష్ణ కీలకంగా వ్యవహరించారు. అయితే, ఈడీ ఎంట్రీతో బయటపడే విషయాలతో పలువురు కీలక నేతలకూ ఉచ్చు బిగియనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.