Wow: అమ్మాయిలూ.. ఈ క‌థ క‌చ్చితంగా చ‌ద‌వండి!

wow savitha pradhan

Share this article

Wow: “ఒక్క క్షణం ఆలస్యం అయితే.. నా మెడకు ఉరి ప‌డేది. కానీ అదే క్షణంలో నా జీవితం మలుపు తిరిగింది” అని చెబుతుంది మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి సవితా ప్రధాన్‌. అత్తింటి వేధింపులతో జీవితం నరకంగా మారినా, రెండుమూడు రొట్టెల కోసం బాత్‌రూమ్‌లో దాచుకుని తినాల్సిన పరిస్థితి వచ్చినా.. చివరకు దేశ సేవ చేసే స్థాయికి చేరి నేటితరం ఆడబిడ్డలకు ఆదర్శంగా నిలుస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని మండీ గ్రామానికి చెందిన ఆదివాసి కుటుంబంలో జన్మించిన సవితాకు చిన్నతనం నుండి కష్టాలే నిత్యసంగతం. బీడీ ఆకులు ఏరడం, కూలీ పనులు చేయడం నిత్యకృత్యంగా ఉండేది. పాఠశాల ప్రవేశం కూడా చదవాలన్న ఆశయంతో కాదు.. రూ.75 స్కాలర్‌షిప్, ఒక జత యూనిఫామ్‌, ఒక పూట జావ కోసం. చదువులో ఆత్మవిశ్వాసం పెరిగి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించింది. కానీ వెంటనే త‌న క‌ల‌ల‌కు క‌ళ్లెం వేస్తూ.. 11 ఏళ్లకు పెద్దవాడైన వ్యక్తితో పెళ్లి జ‌రిగింది.

అత్తింట్లో న‌ర‌కం..
పెళ్లయిన తర్వాత సవితా జీవితంలో అసలు నరకం మొదలైంది. అత్తగారు ఓ కోడ‌లిలా కాదు, పనిమనిషి కంటే అధ్వానంగా చూసేవారు. అందరూ తిన్న తర్వాతే తినాలి, ఏమీ మిగలకపోతే ఆ రోజు ప‌స్తులే ఉండాలి. టీవీ చూడకూడదు, నవ్వకూడదు, తలమీద చెంగు కూడా తీయకూడదు. ఎదురు తిరిగితే భర్త రక్తం కారేలా కొట్టేవాడు. ఆఖ‌రికి ఆకలిని తట్టుకోలేక లోదుస్తుల్లో రొట్టెలు దాచుకుని బాత్‌రూమ్‌లో తినాల్సిన దుస్థితి వచ్చింది. ఇలా కష్టాల మధ్య ఓ రోజు ఉరేసుకోవాలని నిర్ణయించుకున్న సవితా.. చీరను ఫ్యాన్‌కు కట్టి మెడకు చుట్టుకునే వేళ, కిటికీలోంచి అత్తగారు చావ‌నీలే అన్న‌ట్లు చూస్తూ ఉంది. ఆ చూపుతో “ఇలాంటివాళ్ల కోసం నేనెందుకు చచ్చాలి? నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది?” అనే ఆలోచన రావడంతో ఉరిని విరమించి, పిల్లలతో పాటు జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి ఆ ఇంటిని వ‌దిలి బయటకు వచ్చింది.

Wow savitha pradhan ias

నాలుగు రొట్టెల నుంచి నాలుగంకెల జీతం వరకూ…
ఇంటిని వదిలిన తర్వాత రెండు వేల రూపాయలతో ఒక బ్యూటీపార్లర్‌లో సహాయకురాలిగా చేరింది. ట్యూషన్ చెప్పడం, వంటల పనులు, చిన్న ఉద్యోగాలన్నీ చేస్తూనే చదువును కొనసాగించింది. BA, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసి యూనివర్సిటీలో ఫస్ట్‌ వచ్చింది. ఓ రోజు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ చూసి, అందులో ఉన్న జీతం చూసి స్ఫూర్తి పొంది పరీక్ష రాసింది. మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్‌గా ఎంపికై 24 ఏళ్లకే చీఫ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌గా నియమితురాలైంది.

ఇప్పుడేం చేస్తున్నారు..?
ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌, చంబల్‌ ప్రాంతాల్లో అర్బన్ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సవితా, రెండో పెళ్లి చేసుకుని హర్ష్‌ అనే వ్యక్తితో కుటుంబ జీవితం సాగిస్తోంది. తన మొదటి భర్త వేధింపులకు ఎదురుదెబ్బగా.. ఆడబిడ్డల ధైర్యానికి నిదర్శనంగా ఉండాలని నిశ్చయించింది.

🎥 హిమ్మత్‌వాలీ లడ్కియా – యూట్యూబ్‌లో జీవితం పాఠంగా…
“జీవితం లో అగ్ని పరీక్షలు చూసినవాళ్లే మిగిలినవాళ్లకు వెలుగు చూపగలరు” అన్న నమ్మకంతో ‘హిమ్మత్‌వాలీ లడ్కియా’ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిందీ ఈ ఐఏఎస్‌. ఆడబిడ్డలకు ధైర్యం, త‌లెత్తుకుని నిలబడే తత్వం నూరిపోస్తోంది. తన బాధలే పాఠాలుగా, తన పోరాటమే మార్గదర్శిగా ఇప్పుడు ల‌క్ష‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు తాను ఆద‌ర్శంగా నిలుస్తోంది. త‌ను ప‌నిచేసే చోటా త‌న‌కో ప్ర‌త్యేక గుర్తింపు. ఏ క‌ష్టాలు చూసి ఐఏఎస్ గా నిల‌బ‌డిందో.. త‌న జిల్లా ప‌రిధిలో ఆ క‌ష్టాల‌కు చెక్ పెడుతోంది.

ప్ర‌తీ చీక‌టి జీవితానికో వెలుగు పాఠం..
ఈ కథలో ప్రతి అమ్మాయి త‌న‌ని చూసుకోవ‌చ్చు. కొంద‌రి జీవితాల్లో మరీ ఇంత తీవ్ర‌మైన స‌మ‌స్య‌లు లేక‌పోయినా.. ఒంట‌రిత‌నం, ఉద్యోగ‌మంటూ వేధింపులు, పెళ్లి పేరిట ఒత్తిళ్లు, అత్తింటి ఆర‌ళ్లు, కోరుకున్నా ద‌క్క‌ని గౌర‌వం, పుట్టినిళ్ల‌లో ఆడ‌పిల్లంటేనే చిన్న‌చూపు.. ఇలా ఒక‌టా రెండా ఎన్నో దెబ్బ‌లు. ఇలాంటి స‌వాళ్లెన్ని ఎదురైనా.. త‌ల ఎత్తే బ‌లంగా పోరాడాల‌ని చెబుతుంది స‌వితా ప్ర‌ధాన్ క‌థ‌. ఎవ‌రూ ఊహించని విధంగా మ‌లుపు తిరిగిన ఆమె జీవితానికి ఆమే మార్గ‌ద‌ర్శి. ఇలాంటి క‌థ‌లు మీకూ మార్గ‌ద‌ర్శిగా మారొచ్చు. ఈ క‌థ‌ నేటితరం యువతికి స్ఫూర్తిదాయకంగానే కాదు, జీవిత పాఠం.

ఈ క‌థ ఆద‌ర్శంగా అనిపించిందా..? మీరూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా..? ఇలాంటి ప‌రిస్థితుల్లో మీ స్నేహితురాళ్లెవ‌రైనా ఉన్నారా..? అయితే, ఈ క‌థ‌నం వారికి పంపించ‌డం అస్స‌లు మ‌రిచిపోవ‌ద్దు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *