BIS హైదరాబాద్, జూన్ 28: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), హైదరాబాద్ బ్రాంచ్ కార్యాలయం ఆధ్వర్యంలో సిమెంట్ మరియు అనుబంధ ఉత్పత్తుల తయారీదారులు, దరఖాస్తుదారులు, లైసెన్సుదారుల కోసం రెండు రోజుల క్యాప్సూల్ శిక్షణా తరగతులు జూన్ 26, 27 తేదీలలో నిర్వహించబడ్డాయి. భారతీయ ప్రమాణాలపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రమాణాల అమలులో నాణ్యత నియంత్రణపై దృష్టిపెట్టేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది.
బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ తన్నీరు రాకేశ్, ఎన్సీసీబీఎం అధికారులు పాల్గొన్నారు. మొదటి రోజు, తాజా మార్గదర్శకాలు, సర్టిఫికేషన్ మాడ్యూల్స్, సంబంధిత భారతీయ ప్రమాణాలపై సాంకేతిక ప్రజెంటేషన్లు నిర్వహించబడ్డాయి. ముఖ్యంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ (NCCBM) నుండి వచ్చిన నిపుణులు సుదీర్ఘ సాంకేతిక సెషన్లు నిర్వహించి, సిమెంట్ పరీక్షలు, నాణ్యత నిర్వహణకు సంబంధించిన అనేక సందేహాలను నివృత్తి చేశారు. వినియోగదారులకు నాణ్యమైన సిమెంట్ అందించేందుకు పరిశ్రమలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా చర్చించబడింది.

రెండో రోజు, శిక్షణలో పాల్గొన్నవారు లూసిడ్ లాబొరేటరీస్‌ను సందర్శించారు. అక్కడ సిమెంట్‌పై జరిపే రసాయన పరీక్షల ప్రామాణిక విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం BIS హైదరాబాద్ బ్రాంచ్ కార్యాలయంలో ఉన్న టెక్స్టైల్ ల్యాబ్‌ను కూడా సందర్శించి, సిమెంట్ ప్యాకేజింగ్ బ్యాగులపై నిర్వహించే పరీక్షలు, వాటి ప్రమాణాలపై అవగాహన పొందారు.
ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ద్వారా పరిశ్రమల నాణ్యత నియంత్రణ సిబ్బందికి సాంకేతిక అంశాలపై లోతైన అవగాహన కలిగినట్లు పాల్గొన్న వారు తెలిపారు. భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు తయారు చేయడంలో ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
బీఐఎస్ చేపడుతున్న ఈ రకమైన శిక్షణా కార్యక్రమాలు పరిశ్రమల స్థాయిలో ప్రమాణాలపై అవగాహన పెంపుదల, నాణ్యత నియంత్రణలో సామర్థ్యం అభివృద్ధికు దోహదపడతాయని బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ వెల్లడించారు. పరిశ్రమల్లో క్వాలిటీ కంట్రోల్ నిపుణులకు తరచూ ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటితో పాటు ప్రభుత్వ రంగ అధికారులు, వినియోగదారులకూ వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా చేపడుతున్నామన్నారు.

బీఐఎస్ చేసే ప్రతీ కార్యక్రమం గురించి ప్రజలకు తెలిసేందుకు బీఐఎస్ స్టాండర్డ్స్ వాచ్(Standards Watch) అనే ఓ సమాచార వేదికను రూపొందించిందని తెలిపారు. యూట్యూబ్‌లో బీఐఎస్ అధికారిక ఛానల్ ‘ఇండియన్ స్టాండర్డ్స్’ (@IndianStandards)లో ప్రతీ శుక్రవారం ఓ కొత్త బులెటిన్ విడుదలవుతుందని.. ప్రతీ ఒక్కరూ ఈ బులెటిన్ తప్పకుండా చూడాలని శ్రీకాంత్ కోరారు.