TG: మెడికల్ రంగాన్ని ప్రోత్సహిస్తూ, వైద్య విద్యార్థులకు Telangana ప్రభుత్వం మరో సంతోషకరమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ విద్యార్థులు, ఇంటర్న్‌లు, పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లకు స్టైఫండ్‌ను ఒకేసారి 15 శాతం పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు డెంటల్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు గత కొంత కాలంగా తమ స్టైఫండ్ పెంపు కోసం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం మెడికోలకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో పలు కోర్సుల విద్యార్థులకు నెలవారీగా అందే గౌరవ వేతనం ఈ విధంగా పెరిగింది:
🔹 ఇంటర్న్‌లకు నెలకు రూ. 29,792
🔹 పీజీ డాక్టర్లకు
ఫస్ట్ ఇయర్: రూ. 67,032
సెకండ్ ఇయర్: రూ. 70,757
ఫైనల్ ఇయర్: రూ. 74,782
🔹 సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు
ఫస్ట్ ఇయర్: రూ. 1,06,461
సెకండ్ ఇయర్: రూ. 1,11,785
థర్డ్ ఇయర్: రూ. 1,17,103
ఇందులో భాగంగా సీనియర్ రెసిడెంట్లకు కూడా గౌరవ వేతనం పెంపు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మెడికల్ విద్యార్థుల శ్రమకు గౌరవం ఇచ్చే విధంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అదే విధంగా విద్యనుపైనా మరింత శ్రద్ధ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మెడికల్ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కొన్ని కీలకమైన మార్గదర్శకాలు అమలు చేస్తోంది. కొత్త మెడికల్ కళాశాలలు, విద్యార్థుల కోరికలపై స్పందన, స్టైఫండ్ పెంపుతో విద్యార్థుల్లో విశ్వాసం పెరిగిందని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి.
తక్షణమే అమల్లోకి..
ఇకపోతే ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానుంది. సంబంధిత కళాశాలలకు సమాచారం చేరవేయగా, త్వరలోనే విద్యార్థుల ఖాతాల్లో పెరిగిన మొత్తాన్ని జమ చేయనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మెడికోలకు మోటివేషన్‌గా మారుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.