Anchor ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ (Anchor Swetcha) ఆత్మహత్య కేసు సంచలనంగా మారింది. ఆమె మరణంపై స్వేచ్ఛ కూతురు సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తల్లిని టీ న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణ చంద్ర నాయక్ మోసం చేశాడంటూ చెప్పుకొచ్చింది. అయితే, ఆమె ఆత్మహత్య వార్త తర్వాత ఆమెతో చాలా కాలంగా సహజీవనం చేస్తున్న టీ న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణ చంద్ర నాయక్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. స్వేచ్ఛ తన భర్తతో విడిపోయాక పూర్ణ చంద్రతో ఉంటున్నట్లు సమాచారం. అయితే స్వేచ్ఛ, పూర్ణ చంద్రనాయక్ మధ్య కొన్నాళ్లుగా విబేధాలు చోటు చేసుకున్నాయని.. పూర్ణచంద్రతో కలిసి ఉండలేనని ఇటీవలే తన తల్లిదండ్రులకు యాంకర్ స్వేచ్ఛ తెలిపినట్లు బయటపడింది.

పెళ్లి పేరుతో మోసం..?
పలు ప్రముఖ ఛానళ్లలో యాంకర్‌గా, రిపోర్టర్‌గా స్వేచ్ఛ పనిచేశారు. తెలంగాణ వాదిగా, ఉద్యమ జర్నలిస్టుగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జర్నలిస్టుగానే కాకుండా రచయితగానూ పేరుంది. అయితే, టీ న్యూస్ లో చేరిన తర్వాత అక్కడే పని చేస్తున్న పూర్ణ చంద్రతో పరిచయం ఏర్పడింది. అప్పటికే స్వేచ్ఛ మొదటి భర్తతో గొడవలతో తన కూతురుతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ జవహార్ నగర్లో ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. పూర్ణచంద్రతో రిలేషన్ మొదలయ్యాక.. పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు పూర్ణ చంద్ర మాట ఇచ్చాడని.. పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో అతడు తప్పించుకు తిరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం వల్లే ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పెళ్లి అయినప్పటికీ భర్తతో విబేధాల కారణంగా విడిపోయిన స్వేచ్ఛ కొంత కాలంగా తల్లిదండ్రులతో కలిసి ఉండి ఆ తరువాత తన కుమార్తెతో విడిగా ఉంటోంది. శనివారం రాత్రి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పూర్ణ చంద్ర ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

స్వేచ్ఛ ఇటీవలె జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ ఎన్నికల్లో గెలిచారు. జర్నలిస్టు సంఘాల్లోనూ ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే స్వేచ్ఛ.. మహిళ జర్నలిస్టుల్లో ఫైర్ బ్రాండ్. పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలను ఎండగడుతుంటారు. రచనలతోనూ చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. ఆమె మరణంతో జర్నలిస్టు సంఘాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.
