Plane Crash: విమాన ప్ర‌మాదంలో మృతుల లెక్క తేలింది!

Ahmedabad Air India Flight Crash

Share this article

Plane Crash: అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యపై చివరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ ఘటనలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారు అని గుజరాత్ ఆరోగ్య శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఇప్ప‌టి దాకా మృతుల సంఖ్య‌పై ప్ర‌చారాలు, అనుమానాలు సాగుతుండ‌గా.. వాటికి తెర‌దించుతూ కేంద్రం అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది.

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే అదుపు తప్పి కూలిపోయింది. విమానం మేఘని నగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ నివాస భవనంపై దూసుకెళ్లింది. విమానం కూలిన స్థలంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి. ఈ ప్ర‌మాదంలో మొత్తం 275 మంది మృతి చెందారు. వారిలో 241 మంది విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. మిగిలిన 34 మంది భవనంలో నివసిస్తున్న వారిగా గుర్తించారు. ఈ మృతుల సంఖ్యను తాజాగా గుజరాత్ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.

ఒకే అదృష్ట‌వంతుడు..
ఈ ఘోర ప్రమాదంలో ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడటం ఒక మిరాకిల్‌గా మారింది. విమానంలో 11A సీటులో కూర్చున్న బ్రిటిష్-ఇండియన్ వ్యక్తి ప్రమాదం జరిగిన సమయంలో సీటుతో కలిసి బయట పడినట్టు అధికారులు వెల్లడించారు.

Air India Plane Crash

మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి
ప్రభుత్వం మృతదేహాల గుర్తింపు పనిని తగిన జాగ్రత్తలతో చేపట్టింది. ఇప్పటివరకు 260 మృతదేహాలను DNA పరీక్షల ద్వారా గుర్తించారు. 6 మృతదేహాలను ముఖ గుర్తింపు ద్వారా గుర్తించారు. 256 మృతదేహాలను ఇప్పటికే బాధిత కుటుంబాలకు అప్పగించారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్ల‌డించారు. మృతుల్లో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత మృతుల సంఖ్య‌పై ఇదే తొలి ప్ర‌క‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం.

తెలియ‌ని కార‌ణాలు..
ప్రమాదానికి గల ఖచ్చిత కారణం ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్‌ను AAIB (Aircraft Accident Investigation Bureau) నిపుణులు పరిశీలిస్తున్నారు. బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేలింది. ప్ర‌మాదం గురించి పూర్తి వివ‌రాలు చెప్పే ఈ బ్లాక్ బాక్స్‌ను విదేశాల‌కు పంపిస్తున్న‌ట్లు తొలుత ప్ర‌చారం సాగింది. అయితే, విదేశాలకు పంపాల్సిన అవసరం లేదని పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. “బ్లాక్ బాక్స్ భారతదేశంలోనే ఉందని, డేటా రికవరీ కోసం మా నిపుణులు పని చేస్తున్నారు” అని మంత్రి తెలిపారు.

ఎయిర్ ఇండియా తీసుకున్న తక్షణ చర్యలు
ఈ ఘోర ఘటన నేపథ్యంలో ఎయిర్ ఇండియా తక్షణ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ ప్రయాణాల్లో వైడ్‌-బాడీ విమానాల వాడకాన్ని 15% తగ్గించింది. భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. విమానాల్లో అత్యవసర పరిశీలన, సాంకేతిక తనిఖీలను మరింత గట్టిగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ చర్యలు జూన్ 20 నుండి జూలై మధ్య వరకు కొనసాగనున్నాయి. ఎయిర్ ఇండియా ఈ ప్రమాదాన్నిసీరియస్‌గా తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది.

ఈ ప్రమాదం ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని తెచ్చింది. ఒక్కసారిగా 275 మంది ప్రాణాలు పోవడం, అనేక కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. విమానంలో ప్రయాణించిన వారు మాత్రమే కాదు, నేల మీద ఉన్న వారు కూడా ఈ ప్రమాదంలో బలయ్యారు. ఇది దేశ విమానయాన చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనలలో ఒకటిగా నమోదైంది. మిగిలిన మృతదేహాల గుర్తింపు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *