Ceasefire: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన కొన్ని గంటలకే మళ్లీ మిసైల్ మోతలు మోగాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌పై మంగళవారం మరోసారి మిసైల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో బేర్షీవా నగరంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పలు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దగ్ధమైన కార్లు, తగలబడిన చెట్లు ఘటన తీవ్రతను చాటిచెప్పాయి. దాడిలో నాశనమైన నివాస భవన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రకటన రాగానే దాడి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ ప్రకటనను ఇరాన్ ఏమాత్రం లెక్కచేయలేదు. అగ్రరాజ్యాల మీడియా నివేదికల ప్రకారం, ట్రంప్ జూన్ 13న ఇజ్రాయెల్ చేసిన విమాన దాడులకు ముగింపు పలకాలని సూచించినప్పటికీ, ఇరాన్ మాత్రం దాడులను కొనసాగించింది.
ఇరు దేశాలు గత 12 రోజులుగా మిసైల్ దాడులతో పరస్పరం ఎదురుదాడులు చేస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ట్రంప్ ప్రకటన ప్రకారం, గ్రీన్‌విచ్ సమయం ఉదయం 4 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి రావాల్సి ఉంది. అయితే ఇరాన్ మాత్రం ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని వ్యతిరేకించింది.
ఇజ్రాయెల్ సైలెంట్… కానీ అప్రమత్తం!
ఇజ్రాయెల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం, ఇరాన్ దాడులు ఆగితే మేము కూడా దాడులు ఆపుతామని ఇజ్రాయెల్ తెలియజేసినట్టు సమాచారం. ఇజ్రాయెల్ తమ ప్రజలను ఎప్పటికప్పుడు ఫోన్ అలర్ట్లు, SMSలు, సైరెన్లు ద్వారా అప్రమత్తం చేస్తోంది. మిసైల్ షెల్టర్లకు పౌరులను తరలించేందుకు సూచనలు ఇస్తోంది.
ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఇప్పటికే ఇరాన్ నుండి ప్రయోగించిన అనేక మిసైళ్లను గాల్లోనే విజయవంతంగా తుప్పించి పడగొట్టింది. అందుకే మిసైల్ దాడుల్లో మృతుల సంఖ్య ఎక్కువగా లేదని అధికారులు వెల్లడించారు.

ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన
డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక “ట్రూత్ సోషల్”లో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి అని ప్రకటించారు. “12 రోజుల ఈ యుద్ధం ముగించడానికి ఇరాన్, ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నాలకు అభినందనలు. ఇప్పుడు మిగిలిందంతా శాంతే.” అని పేర్కొన్నారు.
ట్రంప్ ప్రకారం, ఇరాన్ ముందుగా కాల్పులు ఆపాలి. 12 గంటల తరువాత ఇజ్రాయెల్ కూడా దాడులను ఆపాలి. ఈ ఒప్పందాన్ని రెండు దేశాలు గౌరవిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్ ఏమంటోంది?
ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం అమెరికా అధ్యక్షుడి ప్రకటనను ఖండించింది. “ఇజ్రాయెల్‌తో ఎలాంటి ఒప్పందం లేదు. మా అణుస్థావరాలపై దాడులకు న్యాయం చేయడాన్ని మేము అస్సలు అంగీకరించం.” అని స్పష్టం చేసింది. ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ కూడా “అగ్రరాజ్యాల దాడులకు తగిన ప్రతీకారం తప్పదు” అని హెచ్చరించిన విషయం తెలిసిందే.
యుద్ధం వెనుక ఉదంతాలు
ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” ప్రారంభించిన తర్వాతే ఈ యుద్ధం ముదిరింది. ప్రాణాలకు భయపడి లక్షలాది మంది టెహ్రాన్ నగరం విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇక ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా బాసటగా నిలిచింది. అమెరికా బాంబర్లు ఇరాన్ అణు స్థావరాలపై భారీ దాడులు చేశారు. ఇదే సమయంలో ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేశారు.
సీజ్‌ఫైర్ తూచ్
ఇప్పటి వరకూ ఈ యుద్ధానికి ముగింపు సూత్రాలు(Ceasefire) స్పష్టంగా అమలులోకి రాలేదు. ట్రంప్ చెబుతున్న కాల్పుల విరమణ ప్రకటనలు ఒక ఎత్తు, భూమిపై జరుగుతున్న దాడులు మరో ఎత్తుగా కొనసాగుతున్నాయి. ఇరాన్ అధికారికంగా కాల్పుల విరమణను త్రోసిపుచ్చడమే కాకుండా, తదుపరి దాడులకు సిద్దంగా ఉందని సంకేతాలు ఇస్తోంది.