Phone Tapping:తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ, మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా 2023 నవంబర్ తర్వాత ట్యాప్ చేసిన సమాచారం మినహా మిగిలిన అన్ని డేటాలను పూర్తిగా డిలీట్ చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని సిట్ అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో 2023 నవంబర్‌లో ట్యాపింగ్‌కు గురైన నెంబర్లకే విచారణ పరిమితం చేశారు. బాధితులైన రాజకీయ నేతలను సిట్ అధికారులు విచారణకు పిలిపించి, వారి వాంగ్మూలాలను సాక్ష్యాలుగా నమోదు చేస్తున్నారు.
“డీజీపీ ఆదేశాల మేరకే చేశాను”: ప్రభాకర్ స్టేట్‌మెంట్
ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికే ఐదో రోజు విచారణకు హాజరయ్యారు. తాజా సమాచారం ప్రకారం, తాను మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకే పని చేశానని స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, విచారణకు పూర్తిగా సహకరించడం లేదు అని సిట్ అధికారులు చెబుతున్నారు. ప్రశ్నలకు చాలావరకు “తెలియదు”, “గుర్తు లేదు” అనే సమాధానాలు ఇస్తున్నారని సమాచారం. సుప్రీం కోర్టు నుంచి పొందిన రిలీఫ్ వలనే ఆయన నిశ్చింతగా వ్యవహరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే, ఆగస్టు 4న సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది.
హార్డ్‌డిస్క్ ధ్వంసానికి ప్రభాకర్ పాత్ర?
ఫోన్ ట్యాపింగ్ డేటా భద్రత విషయంలో కూడా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రణీత్ రావు హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావుకి ప్రమేయం ఉన్నట్లు సిట్ ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్, ప్రిన్సిపల్ సెక్రటరీల స్టేట్‌మెంట్‌లను కూడా సిట్ నమోదు చేసింది.
వీరిలో చాలామంది తమపై ఉన్న ఆరోపణలను తోసిపుచ్చారు. మాజీ డీజీపీ ఆదేశాలతోనే పని చేశామని చెప్పారు. దీంతో, ఇప్పుడు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా విచారించాలని సిట్ యోచిస్తోంది.