Airport: హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మారిపోనుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సేవలు అందిస్తున్న ఈ ఎయిర్‌పోర్టును భారీగా అభివృద్ధి చేయాలని ఎయిర్‌పోర్ట్ నిర్వహణ సంస్థ జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.14,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం.
2029లోపు పూర్తి
ఈ విస్తరణ పనులను 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించి, 2029 సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని జీహెచ్‌ఐఏఎల్ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ను విస్తరించడమే కాకుండా, మరో కొత్త టెర్మినల్ నిర్మాణంతో పాటు రన్‌వేను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్‌లో భాగం. అంతర్గత డాక్యుమెంట్ల ప్రకారం, ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలుస్తోంది.
గరిష్ఠ సామర్థ్యం దాటిన ప్రయాణికుల రద్దీ
జీఎంఆర్ గ్రూప్ నిర్మించిన ఈ ఎయిర్‌పోర్టు ఏటా 3.4 కోట్ల మంది ప్రయాణికులకు, గంటకు 42 విమానాల రాకపోకలకు అనువుగా రూపుదిద్దుకుంది. కానీ 2017-18లో 1.83 కోట్లు ఉన్న ప్రయాణికుల సంఖ్య 2023-24 నాటికి 2.95 కోట్లకు చేరింది. ఇది ఏటా 7.1 శాతం వృద్ధిరేటుగా నమోదైంది. ఇక విమానాల రాకపోకలు గంటకు 36 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎయిర్‌పోర్టు తన గరిష్ఠ సామర్థ్యానికి చేరుకోనుందన్న ఆందోళనతో, విస్తరణ పనులు అత్యవసరంగా మారాయి.
లక్ష్యం – ఏటా 6.7 కోట్ల ప్రయాణికులు
జీహెచ్‌ఐఏఎల్ ప్రణాళికల ప్రకారం, ప్రస్తుత టెర్మినల్ సామర్థ్యాన్ని 3.4 కోట్ల నుంచి 4.7 కోట్లకు పెంచనుంది. అదేవిధంగా కొత్తగా నిర్మించనున్న టెర్మినల్ ద్వారా ఇంకొక 2 కోట్ల మంది ప్రయాణికులు, గంటకు 46-47 విమానాలు రాకపోకలు సాగించగలిగేలా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా 3,800 మీటర్ల పొడవైన మరో రన్‌వేను నిర్మించనున్నారు.
అధునాతన సాంకేతికతతో రన్‌వే
విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా నిర్మించే రన్‌వేలో క్యాటగిరి-1 ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS), అధునాతన నావిగేషన్ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఐఏఎల్ తెలిపింది. వీటివల్ల తీవ్ర వాతావరణం ఉన్నా గానీ, పైలట్లు విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయగలుగుతారు.
రాష్ట్ర అభివృద్ధికి దోహదం
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణతో రాష్ట్రానికి మరింత ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (FDI), ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీ, గ్లోబల్ కార్గో సదుపాయాలు పెరిగే అవకాశముంది. విమానాశ్రయం అభివృద్ధి కేవలం ప్రయాణికులే కాకుండా, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి పెద్ద ఊతమివ్వనుంది.