TG: తెలంగాణలో మరో సాంకేతిక మైలురాయిగా నిలిచే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణమని, ఇది ప్రపంచంలో కేవలం ఐదవ కేంద్రం మాత్రమే అని తెలిపారు. ప్రపంచం గూగుల్(Google) ప్రారంభం తర్వాత పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు మన జీవితం పూర్తిగా డిజిటల్ ఆధారంగా మారిందని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత గోప్యత, భద్రత అత్యంత ప్రాధాన్యమైన అంశాలుగా మారాయని తెలిపారు. ‘‘మన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం, వ్యక్తిగత జీవితాలు కూడా డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించాయి. భద్రతా పరిరక్షణ ఉంటేనే మనం ముందుకు వెళ్తాము’’ అని సీఎం స్పష్టం చేశారు.
సైబర్ సెక్యూరిటీ కేంద్రంగా హైదరాబాద్
గూగుల్ ఆధునిక సైబర్ సెక్యూరిటీ(Cyber Security), డిజిటల్ భద్రతా పరిష్కారాల కోసం ఈ సెంటర్‌ను ఉపయోగించబోతోంది. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కూడా ఈ సెంటర్ ద్వారా మరింత పెరగనున్నాయని తెలిపారు. ‘‘తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంది. ఉత్తమ పెట్టుబడి ప్రాంతంగా తెలంగాణ నిలుస్తోంది. ప్రపంచంలోని కంపెనీలు రాష్ట్రాన్ని ఎంపిక చేయడం సహజం’’ అని సీఎం పేర్కొన్నారు.
గూగుల్ – తెలంగాణ మధ్య బలమైన అనుబంధం
‘‘గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గూగుల్ హైదరాబాద్‌లో తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం సుమారు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు హైదరాబాద్‌ను తమ ఇంటిగా భావిస్తున్నారు’’ అని సీఎం గుర్తు చేశారు. మహిళలకు స్వయం సహాయక సంఘాల కోసం గూగుల్ క్యాంపస్ పక్కన 2.5 ఎకరాల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మహిళల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి
‘‘1 కోటి మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయాలన్నది మా లక్ష్యం. మహిళలు, యువత, రైతులు, మధ్యతరగతి, పేదలు, సీనియర్ సిటిజన్లతో కలిసి రాష్ట్ర అభివృద్ధి జరగాలి. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా గూగుల్ మద్దతు కావాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ట్రాన్స్‌జెండర్‌లకు అవకాశాలు
‘‘ట్రాన్స్‌జెండర్‌లను ముందుకు తీసుకురావడంలో మేమే ముందు. ట్రాఫిక్ నియంత్రణ, జీహెచ్‌ఎంసీ తదితర విభాగాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. గత ప్రభుత్వాలు వారిని నిర్లక్ష్యం చేశాయి. కానీ మా ప్రభుత్వం వారిని సమాజంలో నిలిపే ప్రయత్నం చేస్తోంది’’ అని సీఎం వెల్లడించారు.
నైపుణ్య విద్యకు పెద్దపీట
ప్రతీ ఏడాది తెలంగాణలో 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారని, కానీ నైపుణ్యాల్లో లోపం ఉందని గుర్తించారు. దీనికి పరిష్కారంగా ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను కూడా ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యం
‘‘ప్రజల ఆరోగ్యమే మా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. అన్ని రంగాల్లో గూగుల్‌తో కలిసి పని చేస్తున్నాం. విద్య, భద్రత, ట్రాఫిక్, ఆరోగ్యం, స్టార్టప్‌లు – ప్రతి దశలో భాగస్వామ్యం కొనసాగుతోంది. గూగుల్ లాగే మా ప్రభుత్వానికి కూడా ప్రజల మేలు ముఖ్యమే’’ అని సీఎం తెలిపారు.
తెలంగాణ రైజింగ్ లక్ష్యం
‘‘2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రైజింగ్(Telangana Rising)ను ప్రపంచానికి తెలియజేయడమే మా ధ్యేయం. గూగుల్ సంస్థ కూడా ఈ ప్రయాణంలో భాగస్వామిగా ఉండాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష వ్యక్తం చేశారు.