టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ, కోహ్లీ ఆటతీరును, దూకుడైన క్యారెక్టర్ని అభిమానించేవారిలో సామాన్యులు మాత్రమే కాదు, మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. అందులో ప్రముఖంగా నిలిచే పేరు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్.
తాజాగా మార్క్ టేలర్ చేసిన వ్యాఖ్యలు కోహ్లీ అభిమానుల్లో ఆసక్తిని కలిగించాయి. కోహ్లీని ఎంతగా అభిమానించాడో వెల్లడిస్తూ, ఒకప్పుడు తన కూతురిని కోహ్లీకి పెళ్లి చేయాలని కూడా తలపోయాడని సరదాగా గుర్తు చేసుకున్నారు.
“కోహ్లీ నిజంగా అసాధారణ వ్యక్తి”
“టీమిండియాకు కోహ్లీ కెప్టెన్ అయిన మొదటి రోజుల్లోనే అడిలైడ్ ఓవల్‌లో కోహ్లీని కలుసుకున్నాను. అప్పుడు నేను కోహ్లీని ఇంటర్వ్యూ చేసే అవకాశం పొందాను. అరగంట సమయం ఇచ్చాడు. మేనేజర్ వచ్చి ‘సర్ టైం అయిపోయింది’ అని చెప్పినా, కోహ్లీ మరింత సమయం కేటాయించాడు. ‘మిస్టర్ టేలర్, మీ ప్రశ్నలు అయిపోయాయా?’ అని కోహ్లీ అడిగాడు. నేను ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పగానే, వెంటనే మేనేజర్‌ను ఆపేసి తన సమయాన్ని నాకు ఇచ్చాడు,” అని మార్క్ టేలర్ వెల్లడించారు.
మైదానంలో దూకుడు.. బయట వినయం
“విరాట్ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో, మైదానం వెలుపల మాత్రం అంతే వినయంగా, మానవత్వంతో ఉంటాడు. అతడి వ్యక్తిత్వం నన్ను ఎంతో ఆకట్టుకుంది. అప్పటికి కోహ్లీ వివాహం కాలేదు. నేను సరదాగా ‘నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని అన్నాను. అయితే అప్పటికి నా కూతురు 17 ఏళ్ల వయస్సు మాత్రమే,” అని టేలర్ నవ్వుతూ చెప్పారు.
గొప్ప ఆటగాడిలో ఉండాల్సిన అన్ని లక్షణాలు
“కోహ్లీ ఒక గొప్ప ఆటగాడు. ఫిట్నెస్, అంకితభావం, ప్రొఫెషనలిజం, వినయం – ఇవన్నీ అతడిలో ఉన్నాయి. మైదానంలో ప్రత్యర్థిని మోసగించాల్సిన దూకుడు, అలాగే మైదానం వెలుపల మమకారం చూపే స్వభావం కోహ్లీని ప్రత్యేకంగా నిలిపాయి. అతడిని ఇష్టపడటం చాలా సహజం” అని మార్క్ టేలర్ కొనియాడారు.
కోహ్లీపై మరింత ఆసక్తికరమైన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “తన కూతురిని కూడా కోహ్లీకి ఇవ్వాలనుకున్న అభిమాన మజిలీ ఇదే” అని నెటిజన్లు ముచ్చట పడుతున్నారు