Gold Rate: బంగారం ధరలు మరోసారి జనాన్ని ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. గత వారం రోజుల కిందట 97 వేల రూపాయల వద్ద స్థిరంగా ఉన్న 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు ₹1,01,410 వద్దకు చేరింది. ఒక దశలో కొంతమందికి ఇది పెట్టుబడి ఫలాలు అందించినా, ఇప్పుడు ఆభరణాలు కొనాలనుకునే సాధారణ ప్రజలకు మాత్రం తీరని భారంగా మారుతోంది.
బంగారం రేట్ల పెరుగుదల నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే కాదు – ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పలు పరిణామాల కారణంగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. దేశీయ మార్కెట్లు సైతం దీన్నే అనుసరిస్తూ బంగారం ధరలు భారీగా పెంచేస్తున్నాయి. గత నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.4వేలకు పైగా ధర పెరగడం గమనార్హం.

హైదరాబాద్‌లో ధరలు ఇలా..
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹92,950 వద్ద ఉండగా, అదే రోజు సాయంత్రానికి ₹92,960కి చేరింది. అదే విధంగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.1,01,400 నుంచి రూ.1,01,410కి పెరిగింది. 18 క్యారెట్ల ధర కూడా రూ.76,050 నుండి రూ.76,060కి చేరింది. ఈ పెరుగుదుల అంత తీవ్రంగా కనిపించకపోయినా.. పెద్ద ఎత్తున ఆభరణాలు కొనేవారికి ఇది భారంగా మారనుంది. శనివారం ఉదయం నాటికి మరో రూ.1వెయ్యి రూపాయలు పెరిగి ధర కొనసాగుతోంది.

వెండి కూడా అదే పరిస్థితి..
మే నెల మొదట్లో తగ్గుముఖం పట్టిన వెండి ధరలు మళ్ళీ పుంజుకున్నాయి. మే నెలాఖరుకల్లా వెండి ధరలు క్రమంగా పెరిగిపోతూ వచ్చాయి. నిన్న హైదరాబాద్లో 100 గ్రాముల వెండి ధర ₹12,000 ఉండగా, ఇవాళ అది ₹12,010కి చేరింది. అలాగే కేజీ వెండి ధర ₹1,20,000 నుంచి ₹1,20,100కి పెరిగింది.
ఈ పెరుగుదల పెట్టుబడిదారులకు మాత్రం కలిసొస్తుంది. గత నెలలో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసిన వారు ఇప్పుడు గ్రాముకు రూ.4000 వరకూ లాభం అందుకుంటున్నారు. బంగారం పెట్టుబడి భద్రతా దృక్పథంలో ఎంత ముఖ్యమో ఇది మరొకసారి రుజువు చేసింది.
అయితే, ఈ ధరల పెరుగుదల కారణంగా కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది నిరాశ కలిగించే అంశం. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కొనసాగుతుండటంతో.. అనుకున్న స్థాయిలో కాకుండా అంతకు తక్కువ బంగారు ఆభరణాలే కొని సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
సంప్రదాయ భారతీయ కుటుంబాల్లో బంగారం కొనుగోలు ఓ ఎమోషన్. పెరుగుతున్న ధరలు ఇప్పుడు దాన్ని అవసరంగా మార్చగా.. ఆ అవసరం తీర్చుకునేందుకూ భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ అస్థిరథ, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తదితర అంశాలు ఈ ధరల్ని మరింత ప్రభావితం చేస్తాయని నిపుణుల అంచనా. వారం రోజుల్లో రూ.4వేలు ధర ఇప్పటికే పెరగ్గా.. ఇది ఈ వారంలో ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.