Paytm: కేంద్ర ప్ర‌భుత్వం ‘నో’.. పేటీఎంకు భారీ షాక్‌!

paytm

Share this article

Paytm: డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న పేటీఎంకు మరోసారి ఊహించని ఎదురుదెబ్బ ఎదురైంది. UPI లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) వసూలు చేసే అవకాశం ఉందనే అంచనాలపై కొంతకాలంగా Fintech రంగంలో జోష్ కనిపించినా… కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నిర్ణయంతో భారీ షాక్ తగిలింది. యూపీఐ చెల్లింపుల‌పై ఛార్జీలు వ‌సూలు చేస్తార‌న్న వార్త‌ల‌తో పేటీఎంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మ‌దుపరులు ఆస‌క్తి చూపించారు.. అయితే నిన్న కేంద్ర స‌ర్కారు మ‌రోసారి ఛార్జీల‌పై ఖ‌రాఖండీ ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో మార్కెట్ మూడ్ ఒక్క‌సారిగా మారిపోయింది.

దీంతో పేటీఎం షేరు ధర ఒక్క రోజులోనే దాదాపు 10 శాతం పడిపోయింది. ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్‌లోనే దాదాపు రూ.10వేల కోట్లు ఆవిరయ్యాయని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రానికి పేటీఎం షేరు ₹341 వద్ద క్లోజ్ అవుతూ 6.5% నష్టంతో ముగిసింది.

MDRపై కేంద్రం క్లారిటీ !
Fintech కంపెనీలు చాలా కాలంగా UPI లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు మళ్లీ తీసుకునే అవకాశం కోసం వేచి చూస్తున్నాయి. దీనికోసం కేంద్ర స‌ర్కారును, మంత్రుల‌ను సంప్ర‌దించే ప్ర‌యత్నం చేస్తున్నాయి. అయితే, ఈ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతూ కేంద్రం మ‌రోసారి యూపీఐపై ఛార్జీలు వ‌సూలుకు ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెప్పింది. ప్ర‌జ‌ల‌కు సులువుగా పేమెంట్ ప్ర‌క్రియ జ‌రిగేందుకే యూపీఐ ఉంద‌ని.. ఛార్జీలు వ‌సూలు చేసి మ‌ళ్లీ ఇబ్బందుల్లో ప‌డేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే, పేటీఎం గ‌తంలో భారీ కుదుపుల‌కు లోనైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మ‌రోసారి మార్కెట్లో నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేస్తూ.. ఈ MDR పునరుద్ధరణపైనే ఆశ‌లు పెట్టుకుంది. దీని ద్వారానే ఆదాయ స‌మీక‌ర‌ణ వ్యూహాలు ర‌చిస్తోంది. ఇప్పుడు దానికి అడ్డుక‌ట్ట ప‌డ‌టంతో ఆదాయ మార్గాలు మూసుకుపోయిన‌ట్ల‌యింది.

ఒక్కరోజు నష్టం ఎంతంటే…
ఈ ఒక్క రోజు ట్రేడింగ్‌లోనే పేటీఎం మార్కెట్ విలువలో ₹9,800 కోట్లు క్షీణించాయి. ఇది చిన్న విషయం కాదు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న కంపెనీకి ఈ ఒక్క ప‌రిణామం పూర్తిగా సంస్థ‌ను తలకిందులయ్యేలా చేసింది. ఇది ఫిన్‌టెక్ షేర్ల‌లో అతిపెద్ద న‌ష్టంగా రికార్డుకాగా.. మ‌రోసారి ఈ సంస్థ మ‌దుప‌ర్లను ఇప్ప‌ట్లో ఆక‌ట్టుకునేలా క‌నిపించ‌ట్లేదు. ఇది సంస్థ‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ‌గా మారే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Paytm UPI Apps

ఇప్పుడు ఫిన్‌టెక్ కంపెనీల పరిస్థితి ఏంటి?
UPI లావాదేవీలు రోజుకో లక్ష కోట్లకు పైగా జరగుతున్నాయి. కానీ వాటిపై MDR లేకపోవడం వల్ల పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు పెద్దగా ఆదాయం రావడం లేదు. పేటీఎం, ఫోన్ పే లాంటి కంపెనీలు ఈ సేవలు కొనసాగించాలంటే సర్వర్ ఖర్చులు, మెయింటేనెన్స్‌, సెక్యూరిటీ, ఫ్రాడ్ డిటెక్షన్ ఇలా ఎన్నో ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. కానీ రిట‌ర్న్‌లో రూపాయి లాభం లేదు. దీంతో ముందు నుయ్యి, వెన‌క గొయ్యి అన్న‌ట్లు త‌యారైంది ఫిన్ టెక్ సంస్థల ప‌రిస్థితి. ఇప్పుడు కేంద్రం నిర్ణ‌యంతో ఉన్న పెట్టుబడిదారులు కాస్త వెన‌క్కి త‌గ్గ‌డంతో పూర్తిగా మైన‌స్‌లోకి వెళ్లే దుస్థితి ఏర్ప‌డిందని ఆయా రంగాల నిపుణులు వాపోతున్నారు.

మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు?
పేటీఎం షేరు పతనం, కేంద్రం క్లారిటీపై మార్కెట్ విశ్లేషకులు స్పందిస్తూ – “ఇది ఓ క్లియర్ సంకేతం. పాత ఆదాయ మార్గాలపై ఆధారపడితే ఇక ఫిన్‌టెక్ రంగం న‌డ‌వ‌డం క‌ష్టం. ఇప్పుడు కంపెనీలు కొత్త మార్గాలు అన్వేషించాలి. ఆదాయాలు లేని బిజినెస్ మోడల్ మార్కెట్‌లో నిలబడదు” అని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే, మున్ముందు డిజిటల్ లోన్స్, వాలెట్‌ ఫీజులు, ఫీచర్‌డ్ సర్వీసులు వంటి ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Paytm News | MDR Charges News | Fintech News | Paytm Loss

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *