Plane Crash ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లపై దెబ్బ‌!

plane crash stocks down

Share this article

Plane Crash: అహ్మ‌దాబాద్ ఎయిర్ ఇండియా విమాన‌ ప్రమాదం, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల.. వెర‌సి దేశీయ స్టాక్ మార్కెట్ల‌పై దెబ్బ ప‌డింది. గ‌త రెండు రోజులుగా అమెరికా టారిఫ్ భ‌యాల‌తో అస్థిరంగా కొన‌సాగిన మార్కెట్‌.. శుక్ర‌వారం ఈ మూడింటి ప్ర‌భావంతో భారీ న‌ష్టాలు న‌మోదు చేసింది.

ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. AI171 అనే ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ వార్త మార్కెట్లలో తీవ్ర నెగటివ్ సెంటిమెంట్‌కు దారి తీసింది.

ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధం మ‌రోవైపు..
ఇప్పటికే అంతర్జాతీయంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్న తరుణంలో, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక చర్యలు తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన బాంబుల దాడులతో ఇరాన్ కీలక అణు కేంద్రాలు లక్ష్యంగా మారినట్టు తెలుస్తుండగా, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కౌంటర్ ఆపరేషన్ చేపట్టవచ్చన్న ఊహాగానాలు పెరిగాయి. దీనివల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా 12 శాతం పెరగడంతో, ఆయిల్ ఆధారిత రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఈ అన్ని పరిణామాల మధ్య, శుక్ర‌వారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ నష్టాలతో కదలాడాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభ సమయంలోనే 1,100 పాయింట్లు పడిపోయి 80,570 స్థాయికి చేరగా, నిఫ్టీ 330 పాయింట్లు నష్టపోయి 24,553 వద్ద కొనసాగింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా తీవ్రంగా వెనకడుగువేశాయి.

Ahmedabad Air India Flight Crash

తీవ్ర ఒత్తిడిలో విమాన‌యానం..
విమానయాన, టూరిజం, ఆయిల్ కన్స్యూమింగ్ రంగాల్లో షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీలు ట్రేడింగ్ ప్రారంభం నుంచే ప్రెజర్‌లో కనబడ్డాయి. అంతర్జాతీయంగా కూడా ప్రభావం స్పష్టంగా కనిపించింది. బోయింగ్ కంపెనీకి చెందిన డ్రీమ్‌లైనర్ ఈ ప్రమాదానికి గురైన కారణంగా, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బోయింగ్ షేర్ 5 శాతం పడిపోవడం గమనార్హం.

మొత్తానికి ఈ సంఘటనలు మార్కెట్ మూడ్‌ను పూర్తిగా ప్రభావితం చేశాయి. ఒకవైపు ప్రమాదకర వార్తలు, మరోవైపు అంతర్జాతీయ ఉద్రిక్తతలు – ఇవన్నీ కలిసి పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం మార్కెట్ తాత్కాలికంగా ప్రెజర్‌లో ఉంటే, మద్దతు స్థాయిగా నిఫ్టీ 24,500 వద్ద నిలవవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా, రాజకీయ అస్థిరతలు తగ్గితేనే మార్కెట్లలో తిరిగి స్థిరత రాగలదని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఇది. తాత్కాలికంగా మార్కెట్ నెగటివ్ ట్రెండ్‌లోనే కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Stock Market Fall | Plane Crash | Air India Plane Crash |

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *