Agra: ఆగ్రాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఎండ వేడిమి ఎక్కువుంది.. పెళ్లి కొడుకు కనీసం ఏసీ కూడా పెట్టించలేదనే కారణంతో చివరి నిమిషంలో పెళ్లి ఆపేసిందో వధువు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రా పరిధిలోని శంషాబాద్‌కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. అక్కడి ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం మధ్యాహ్నం పెళ్లి జరగాల్సి ఉంది. బంధువులు, వధూవరులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. పీఠలపై కూర్చుని పెళ్లి జరిగే క్రమంలో.. పెళ్లి కుమార్తె హఠాత్తుగా లేచి నిల్చుంది. ఈ ఉక్కబోత నేను భరించలేకున్నాను.. నాకు ఈ పెళ్లి వద్దంటూ ఆమె తల్లిదండ్రులకు అక్కడున్న ఆమె తల్లిదండ్రులకు తేల్చి చెప్పింది.
అయితే, పెద్దలు వివాదాన్ని సద్దుమణిచే ప్రయత్నం చేయగా.. వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు పెళ్లి కుమార్తె.. ప్రతీచోట ఏసీ బేసిక్ విషయం. ఏసీ కూడా పెట్టించలేని వాడు నన్నేం చూసుకుంటాడంటూ వాగ్వాదం చేసింది. పెళ్లికి ముందే ఇక్కడ ఏసీ పెట్టించాలనే షరతు వరుడికి పెట్టానని.. అయినా నా మాటకు గౌరవం ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చింది సదరు పెళ్లి కూతురు. ఇదంతా చూసి అవాక్కవ్వడం అక్కడి అతిథుల వంతైంది.
అయితే, ఈ ఘటనలో మాటామాటా పెరగడంతో.. పోలీసులు రంగప్రవేశం చేశారు. అప్పటికప్పుడు మాట మార్చిన ఆ పెళ్లి కూతురు తనపై వరకట్నం వేధింపులకు పాల్పడ్డారని.. కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారంటూ వరుడు, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో వధువు కుటుంబం సైతం యువతినే తప్పుపట్టినట్లు తెలిసింది.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలె ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో సోనమ్ అనే యువతి ఆమె భర్తను సుపారీ కిల్లర్లతో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను జోడిస్తూ.. నువ్వు బతికిపోయావ్ బ్రో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.