NRI: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులకు శుభవార్త. త్వరలో వీసా, పాస్‌పోర్ట్ సమస్యలకు ఇక ఫుల్‌స్టాప్ పడినట్లే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న ప్రవాస భారతీయ సంక్షేమ పాలసీ ప్రవాస భారతీయులకు ఎన్నో అవకాశాలను, వినూత్న సౌకర్యాలను అందించనుంది. ఈ పాలసీ ద్వారా విదేశాల్లో ఉన్న ప్రవాసుల సమస్యలకు వేగంగా పరిష్కారం చూపించేందుకు కేంద్ర సర్కారు కసరత్తులు చేస్తోంది.
ప్రస్తుతం గల్ఫ్ దేశాలతోపాటు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో లక్షలాదిమంది భారతీయులు స్థిరపడ్డారు. వీరిలో చాలామందికి వీసా పొడిగింపు, పాస్‌పోర్ట్ రిన్యువల్, ఇమిగ్రేషన్ క్లియరెన్స్ వంటి అనేక సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో ఉద్యోగం చేసి, కుటుంబాలను పోషిస్తున్న ప్రవాస భారతీయులకు సకాలంలో సహాయం అందించేందుకు ఇప్పటి వరకు సరైన వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ప్రవాస భారతీయ సంక్షేమ డిజిటల్ మిషన్’ పేరుతో కొత్త పాలసీని రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నూతన పాలసీకి కేంద్ర కేబినేట్ ఆమోదం లభించినట్లు సమాచారం.

ఎప్పుడు అందుబాటులోకి..?
జూలై 15న దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ పాలసీని అధికారికంగా దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. 2026 మార్చి నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏం జరగబోతోంది..?
ఈ కొత్త పాలసీలో భాగంగా ఓ ప్రత్యేక డిజిటల్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రవాస భారతీయులు తమ వీసా, పాస్‌పోర్ట్, లీగల్ సమస్యలను నేరుగా నమోదు చేసుకునే వీలు ఉంటుంది. దీంతో సమస్యల పరిష్కారం వేగవంతం కానుంది. మరోవైపు, 24 గంటల సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇకపోతే పాస్‌పోర్ట్ రిన్యూవల్ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా డిజిటల్ క్లియరెన్స్ అందుబాటులోకి రానుంది.
గల్ప్ కార్మికులకు అండగా..
భారత్ నుంచి కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తుంటారు. కుటుంబాలకు దూరంగా ఏళ్ల తరబడి ఉండే ఈ కార్మికులకు ఏం జరిగినా స్పందన కరవే. తెలిసి వాళ్లు ఉంటే తప్ప.. అక్కడ నిలదొక్కుకోలేని దుస్థితి. ఈ కష్టాలను తీర్చేందుకు వీరిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది కేంద్ర సర్కారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసమే ప్రత్యేక సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. లీగల్ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి భారత ప్రభుత్వం నుండి న్యాయ సహాయం అందించే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా విదేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేందుకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ రెండో దశను కూడా ప్రారంభించనున్నారు.
తెలుగు భాషలోనే..!
ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రవాసులు ఈ కొత్త మార్పులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలోని టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, కెనడాలోని టోరంటో, ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్, అలాగే గల్ఫ్ దేశాలలో దుబాయ్, అబుదాబి, ముస్కట్, కువైట్, సౌదీ వంటి ప్రధాన ప్రాంతాల్లో భారీగా తెలుగు జనాభా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు.
ఈ రాష్ట్రాల్లోని తెలుగు సంఘాలు ఇప్పటికే భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ, కొత్త పాలసీకి పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. ఈ డిజిటల్ మిషన్ ద్వారా ప్రత్యేకంగా తెలుగు భాషలో సపోర్ట్ లైన్, సర్వీసులు అందించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇది అమలులోకి వచ్చిన తర్వాత విదేశాల్లో ఉన్న తెలుగు ప్రవాసులకు ఎన్నో నూతన అవకాశాలు, సౌకర్యాలు లభించనున్నాయి.
అంతేకాకుండా, విదేశాల్లో చదువులకు వెళ్లే తెలుగు విద్యార్థులకు కూడా ఈ పాలసీ ఉపయోగపడనుంది. వీసా క్లియరెన్స్, డాక్యుమెంటేషన్ వంటి అంశాల్లో తాజా మార్పులతో విద్యార్థులకి మరింత సులువుగా ప్రక్రియలు పూర్తయ్యేలా మారనుంది.
సంపూర్ణంగా చూసినప్పుడు ఈ కొత్త ప్రవాస భారతీయ సంక్షేమ పాలసీ ద్వారా లక్షలాది మంది తెలుగు ప్రవాసులకు సత్వర, న్యాయమైన సేవలు అందే అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రవాస భారతీయుల పాలసీలు, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం కోసం ఈ వెబ్‌సైట్లు చూసొచ్చు:
1️⃣ https://mea.gov.in — Ministry of External Affairs (India)
2️⃣ https://www.passportindia.gov.in — Official Passport Portal
3️⃣ https://www.emigrate.gov.in — Emigration Clearance Portal
4️⃣ https://www.indiandiaspora.nic.in — Indian Diaspora Portal
Gulf Labors, New NRI Policy, NRI, Indian Government, Indians, Abroad Jobs, NRI,