Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సోమవారం ఉదయం జిల్లాలోని ఎల్మగుండా-పువార్టి మార్గంలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ముందుగా ఏర్పాటు చేసిన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్)తో పేల్చేశారు.
ఈ పేలుడులో అడిషనల్ ఎస్పీ ఆకాశ్ రావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, వాహనంలో ఉన్న మరో ముగ్గురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా రాయపూర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేత మొదలుపెట్టాయి. ఇందులో భాగంగానే పలువరు అగ్రనాయకులను మట్టుబెట్టాయి. నాయకత్వాన్ని కోల్పోయి పార్టీ బలహీనపడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సుక్మాలో మావోయిస్టుల కదలికలు పెరిగాయన్న సమాచారంతో పోలీసులు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఎల్మగుండా-పువార్టి మార్గంలో అడిషనల్ ఎస్పీ ఆకాశ్ రావు నేతృత్వంలో పోలీస్ బృందం వెళ్తుండగా, ముందుగా ఏర్పాటు చేసిన ఐఈడీకి వాహనం బలయ్యింది.
పేలుడు తీవ్రమవడంతో వాహనం నుజ్జునుజ్జయింది. పోలీసులు ఈ మార్గంలో వస్తారన్న ముందస్తు సమాచారంతోనే బాంబు పేలుడు పథక రచన చేసినట్లు సమాచారం. ఈ పేలుడు అనంతరం మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. భద్రతా దళాలు సరిహద్దులు, ప్రధాన ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశాయి.
Operation Kagar, Maoist attack, Maoist News