తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 11 మంది వివిధ శాఖలకు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. కేబినేట్లో ఖాళీగా ఉన్న మిగతా ఆరు స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర నేతలు కసరత్తులు చేస్తున్నారు. సర్కారు ఇప్పటికే ఏడాది పూర్తి చేసుకున్నా.. నేతల మధ్య సయోధ్య లేకపోవడం, మంత్రి పదవి ఆశావహుల జాబితా ఎక్కువుండటంతో మంత్రివర్గ విస్తరణకు ముందడుగు వేయలేదు. అయితే, ఇటీవల సీఎం రేవంత్ మిగతా కీలక నేతల సహకారంతో వివిధ సమీకరణాలతో ఆరుగురి లిస్ట్ ఫైనల్ చేసి దిల్లీ అధిష్టానం ముందు పెట్టారు. దీనికి సోనియా, రాహుల్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ అపాయింట్మెంట్ సైతం తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం లేదా సోమవారం ఈ కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశముంది.
- వివేక్ వెంకటస్వామి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వివేక్ వెంకటస్వామికి ఎస్సీ మాల సామాజిక వర్గంలో మంచి పట్టుంది. ఆయన కుమారుడు పెద్దపల్లి నుంచి ఎంపీగా, సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి కాకా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ప్రముఖ మీడియా సంస్థలకు అధిపతిగా ఉన్న వివేక్‌కు.. గతంలోనే కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి ఆయనకు కేబినేట్లో చోటు దక్కనున్నట్లు సమాచారం. - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి:
మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డికి కేబినేట్ బెర్త్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. అయితే, రాజగోపాల్‌రెడ్డికి పార్టీలోకి వచ్చే సమయంలోనే అధిష్టానం హామీ ఇవ్వడంతో ఈసారి చోటివ్వనున్నట్లు సమాచారం. ఆయనకు ఇస్తే ఒకే కుటుంబంలో ఇద్దరికి వివాదంగా మారే అవకాశమున్న నేపథ్యంలో వెంకట్‌రెడ్డిని భర్తరఫ్ చేసే అవకాశముందనే ప్రచారముంది. రాజగోపాల్ బదులు రామ్మోహన్ రెడ్డికి ఇచ్చేందుకు రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. - వాకిటి శ్రీహరి ముదిరాజ్
ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఆయనకు కుల సమీకరణాల నేపథ్యంలో ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. - షబ్బీర్ అలీ
మైనారిటీ నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేకపోగా.. ఈసారి సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి చోటు దక్కనుంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన రఫీక్ పేరూ వినిపిస్తుండగా.. షబ్బీర్ అలీకే ఎక్కవ అవకాశముంది. ఇప్పుడు మంత్రిగా ప్రకటించి వచ్చే మూడు నెలల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానంలో ఆయనకు చోటు కల్పించనున్నారు. - విజయశాంతి
సినీ నటి, ఫైర్ బ్రాండ్ విజయశాంతిని ఇటీవలె కాంగ్రెస్ సర్కారు ఎమ్మెల్సీ ని చేసింది. బీసీ సామాజిక వర్గంతో పాటు మహిళా కోటాలో విజయశాంతికి చోటు దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి,. ఆమె వాగ్దాటి, కేసీఆర్ చేసిన మోసంను కవర్ చేయడం పార్టీకి కలిసొస్తుందనే భావనలో అధిష్టానం ఉన్నట్లు వినికిడి. - అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు తమకు మంత్రివర్గంలో చోటివ్వాలని అధిష్టానంతో పాటు సీఎంకూ వినతులిచ్చారు. ఈ ఆరుగురిలో పార్టీకి కట్టుబడి ఉండటంతో పాటు సీఎం రేవంత్‌కు అనుయాయుడిగా, జగిత్యాల జిల్లాల్లో కీలక నాయకుడిగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. మాదిగ నేతలను దిల్లీ చేర్చడంలో, మంత్రి పదవి సాధనలో ఆయనే ముఖ్య భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పించేందుకు అదిష్టానం యోచిస్తోంది.
వీరితో పాటు ఉపముఖ్యమంత్రిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌కు అవకాశం కల్పించనున్నారనే వార్తలు శనివారం నుంచి ప్రచారంలో ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమో సోమవారం తెలిసే అవకాశముంది.
ఈ ఆరుగురితో పాటు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న కొండా సురేఖను తప్పించనున్నట్లు సమాచారం. వరస వివాదాలతో పార్టీకి, ప్రభుత్వానికి ఆమె వల్ల నష్టం జరుగుతుందని ముఖ్య నేతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో మరో మహిళా నేతలకు మంత్రి వర్గంలో చోటు దక్కొచ్చు.
ఇదిలా ఉండగా.. బీసీ సామాజిక వర్గం నుంచే ఆది శ్రీనివాస్, మాల సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ప్రస్తుతానికి మంత్రివర్గ రేసులో ఉన్నారు. ఎవరైనా బయటికొస్తే వీరికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి మధన్ మోహన్ రావుకి కూడా మంత్రి పదవి కన్ఫర్మ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.