Hyderabad: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) విద్యాసంస్థల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్టాండర్డ్స్ క్లబ్ మెంటార్లకు హైదరాబాద్ శాఖ అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని రాయల్ రెవ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల ప్రభుత్వ పాఠశాలలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీల మెంటార్లు పాల్గొన్నారు. స్టాండర్డ్స్ క్లబ్ రూపకల్పన, నిర్వహణ, విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు తదితర అంశాలపై అధికారులు శిక్షణ అందించారు.

ఈ సందర్బంగా బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే పిల్లలకు భారతీయ ప్రమాణాలు, నాణ్యతను పరిచయం చేసేందుకు, భవితకు బలమైన పునాదులు నిర్మించేందుకు బీఐఎస్ దేశవ్యాప్తంగా 11వేల స్టాండర్డ్్స క్లబ్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 189 క్లబ్‌లు వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ క్లబ్‌లలో 9 నుంచి 12వ తరగతి, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులు సభ్యులుగా ఉంటారని. వీరికి ఓ సైన్స్ టీచర్ మెంటార్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ క్లబ్ ద్వారా విద్యార్థులకు భారతీయ ప్రమాణాల రచన నైపుణ్యాలు, జాతీయ స్థాయి క్విజ్ పోటీలు, విద్యాసంస్థల్లో వివిధ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులను ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ విజిట్ ద్వారా పరిశ్రమలకు తీసుకెళ్లి ప్రాక్టికల్ విషయ పరిజ్ణానం అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో టీచర్లు, లెక్చరర్లు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. బీఐఎస్ అందిస్తున్న నాణ్యతా గుర్తులు ఐఎస్ఐ, బంగారానికి హాల్‌మార్కు, ఎలక్ట్రానిక్ వస్తువులపై రిజిస్ట్రేషన్ మార్కుల గురించి కూలంకశంగా వివరించడంతో పాటు బీఐఎస్ చేపడుతున్న ప్రతీ కార్యక్రమం, వినియోగదారుడిగా ఉండాల్సిన అవగాహన తదితర అంశాలపైనా వీరికి అవగాహన కల్పించామన్నారు.
రెండో రోజు నిర్వహించిన భారతీయ ప్రమాణాల రచన, బృందం చర్చలు, మాక్ పార్లమెంట్ నిర్వహణలోనూ టీచర్లు ఉత్సాహంగా పాల్గొని వారి సలహాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ రాకేశ్ తన్నీరు, విశ్రాంత శాస్త్రవేత్తలు ఏఎన్ఎస్‌పీ శాస్త్రి, కంచర్ల రాజా, ఎస్పీవో అభిసాయి ఇట్ట పాల్గొన్నారు.
BIS Hyderabad, Bureau of Indian Standards, Standard Clubs, ISI Mark, Hallmark