Telangana: తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తీసుకొచ్చిన రైతు భరోసాలో కీలక మార్పులు చేపట్టనుంది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇప్పటివరకు ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి రెండు విడతలుగా రూ.6,000 చొప్పున మొత్తం రూ.12,000 మంజూరు చేసేది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కొంత భిన్నంగా, ఈ మొత్తాన్ని ఒకే విడతగా చెల్లించే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే రైతులకు ఒకేసారి రూ.12,000 వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. గతంలో బీఆర్ఎస్ అందించిన రైతు బంధు స్థానంలో కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా తెచ్చిన విషయం తెలిసిందే. అయితే రైతు బంధు.. పెద్ద భూస్వాములకు ఆధాయ వనరుగా మారగా.. రైతు భరోసా ప్రధానంగా సన్నకారు రైతులను ఆదుకుంటోంది.
ఖరీఫ్‌కి ముందే డబ్బులు..
దీంతో రైతులు ఖరీఫ్ సీజన్‌కు ముందే అవసరమైన పెట్టుబడి సొమ్మును సమకూర్చుకునే అవకాశం పొందుతారు. విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్ భాడాలు వంటి ఖర్చులను ముందుగానే నిర్వహించుకోవచ్చు. దీంతో వ్యవసాయ పనులు సమయానుసారంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఇది చాలా ఊరట కలిగించే నిర్ణయం.
ఈ చెల్లింపును జూన్ మూడో వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు ఈ మద్దతు అందించాలనే ఉద్దేశంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇది నేరుగా 70 లక్షల మందికిపైగా రైతులకు లబ్ధి చేకూర్చే అవకాశముంది.
అడుగడుగునా సవాళ్లే..!
అయితే, ప్రభుత్వం ముందుకొచ్చిన ఈ నిర్ణయం ఆర్థిక పరంగా పెద్దసవాలుగా మారింది. రాష్ట్రానికి అందుబాటులో ఉన్న వనరులు పరిమితంగా ఉండటంతో, ఈ మొత్తాన్ని సమకూర్చటం సులభం కాదు. ఇటీవల పెరిగిన రుణభారం, కేంద్రం నుంచి రావలసిన నిధుల ఆలస్యం, ఇతర సంక్షేమ పథకాల నిధుల అవసరం.. ఇలా అన్నీ కలిపి ఆర్థిక ప్రణాళికను కఠినంగా మార్చాయి.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు వివిధ మార్గాలు పరిశీలిస్తోంది. ఆర్ధిక శాఖ ప్రత్యేకంగా ఈ చెల్లింపుల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కొన్ని ఇతర విభాగాల్లో ఖర్చులను తగ్గిస్తూ, రైతు భరోసా చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వనుంది.
మొత్తంగా చూస్తే, రైతుల కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయం, తగిన వనరులను సమకూర్చగలిగితే, వ్యవసాయ రంగానికి ఊపునిస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
Raitu Barosa, Congress Government, Telangana State News, Formers welfare