
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న డీఎస్సీ పరీక్షలో అభ్యర్థులకు ఇబ్బందులు తప్పట్లేదు. నోటిఫికేషన్ విడుదల నుంచీ ఏదో ఓ సమస్య పుడుతూనే ఉంది. సాంకేతిక సమస్యలతో దరఖాస్తుకు ఇబ్బంది పడిన అభ్యర్థులు.. మొన్నటి దాకా పరీక్ష తేదీ మార్చాలని, ఇంకాస్త సమయం పెంచాలని పోరాడారు. ఇప్పుడు మరో కొత్త సమస్యతో సతమతమవుతున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత డీఎస్సీ 2025 పరీక్షా హాల్‌టికెట్ల(AP DSC Halltickets)ను విడుదల చేసింది సర్కారు. డౌన్‌లోడ్ చేసుకుని ప్రిపరేషన్ మీద కూర్చుందామనుకున్న అభ్యర్థులకు డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది. పరీక్షలో రాసే ఒక్కో సబ్జెక్టు పేపర్‌ను ఒక్కో ప్రాంతంలో వేసింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న సెంటర్లను ఇష్టానుసారంగా కేటాయించింది. నెల్లూరుకు చెందిన ఓ అభ్యర్థికి.. 24వ తేదీ జరిగే ఓ పరీక్ష కేంద్రం కడపలో పడింది. 25వ తేదీన జరిగే పరీక్ష కర్నూలు.. 26వ తేదీ పరీక్ష హైదరాబాద్(Hyderabad)లో కేటాయించారు. దీంతో మూడు రోజుల వ్యవధిలో ఆ అభ్యర్థి రెండు రాష్ట్రాలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చిత్తూరుకు చెందిన మరో అభ్యర్థికి ఐదు రోజుల పరీక్షలో ఓ రోజు గుంటూరు, ఓరోజు హైదరాబాద్, మరొక రోజు కర్నూలు, మరొక రోజు విజయవాడ, చివరి రోజు హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. వీటికోసం ప్రతీరోజూ అతడికి ఈ కేంద్రాల మధ్య తిరగడానికే సమయం సరిపోతుంది. దాదాపు వేల మంది అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను ఇప్పటికే డీఎస్సీ బోర్డుతో పాటు విద్యాశాఖ దృష్టికి పలువురు అభ్యర్థులు తీసుకెళ్లినట్లు సమాచారం. సరైన న్యాయం చేస్తామని ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా పరీక్షకు ఇంకో మూడు రోజులే మిగిలి ఉండటంతో అభ్యర్థుల్లో ఆందోళన తప్పట్లేదు.