
Bangalore: 3BHK అపార్ట్‌మెంట్ రెంట్(Rent) ఒక నెలకి కేవలం రూ.2.7లక్షలే.. ఏంటి షాకయ్యారా..? అవును, మీరు విన్నది నిజమే. బెంగళూరు నగరంలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రెడ్డిట్ వేధికగా పెట్టిన పోస్టులో ఓ 3 బీహెచ్‌కే ఫ్లాట్ ధరను రూ.2.7లక్షలుగా ప్రకటించింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది.
రూ.2.7లక్షలు అనగానే ఏదో పాష్ ఏరియానో లేక లగ్జరీ(Luxury Flat) బాగా ఉండే ఫ్లాటో అనుకుంటే మీరు పొరబడ్డట్టే. అది సాధారణ 1400 స్వేర్ ఫీట్‌లో నిర్మించిన 3 బీహెచ్‌కే.. అందులోనూ సిటీ సెంటర్‌కు కాస్త దూరంగానే ఉండే ఓ ప్రాంతంలో. అయితే, ఇది రెడ్డిట్ వేధికగా పోస్టు పెట్టిన నుంచే ఫుల్ వైరల్ గా మారింది. ఇది నిజమా కాదా, లేక ఫేక్ లిస్టింగ్ కోసం చేసిన ఎడిటింగా ఇప్పటివరకూ ఆ సంస్థతో పాటు, రెడ్డిట్ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఈ పోస్టులో అడ్వాన్సు పేమెంట్ రూ.15లక్షలుగా ఉండటం గమనార్హం.

బెంగళూరు ఇప్పటికే భారత్‌లో అత్యధిక అద్దె ధరలు ఉండే నగరాలలో ఒకటిగా మారిన సంగతి తెలిసిందే. ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందిన ఈ నగరంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటంతో దేశ విదేశాల నుంచి ఐటీ ఉద్యోగులు ఇక్కడికొచ్చి స్థిరపడుతున్నారు. గత పదేళ్లుగా మిగతా హైటెక్ నగరాలతో పోల్చితే బెంగళూరుకే ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ ఎక్కువ కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఇక్కడ నివాస స్థలాలకు భారీగా డిమాండ్ పెంచేస్తోంది. దీనికి తోడు సిటీ సెంటర్‌కు సమీపంలో కొత్త భవనాల నిర్మాణాలు పెద్దగా లేకపోవడం, జనాల సంఖ్యకు తగిన నిర్మాణాలు అందుబాటులో లేకపోవడంతో ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందిన కాడికి దోచుకుంటున్నారు.
ఇలాంటి సంఘటనలు నగరంలో నివాసం ఉండే మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో సింగిల్ బెడ్ రూం ఫ్లాట్‌కి నెలకు ₹50,000 పైగా అద్దె వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ ₹2.7 లక్షల లిస్టింగ్‌ను చూసి ప్రజలు ఆశ్చర్యపోవడమే కాదు, అద్దె నియంత్రణపై చట్టాలు అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నిర్వాహకులు దీనిపై స్పందించకపోయినప్పటికీ, ఈ లిస్టింగ్ నిజమా కాదా అన్నది ఇంకా క్లారిటీతో తెలియాల్సి ఉంది. అయితే ఇది బెంగళూరులోని అద్దె భారం ఎంత తీవ్ర సమస్యగా పరిణమిస్తోందో చెబుతోందని నెటిజన్లు వాపోతున్నారు. దీనిపై సర్కారు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా బెంగళూరు నగరంలో నాన్ కన్నడిగ ఐటీ ఉద్యోగుల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.