
Hyderabad: గత కొన్నేళ్లుగా భారీగా పెరుగుతూ వస్తోన్న వంటనూనె ధరలు(Edible Oil) సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. నూనెలు కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది. దీనికి పరిష్కారం చూపేందుకు కేంద్ర సర్కారు ఓ అడుగు ముందుకేసింది. క్రూడ్ ఆయిల్ దిగుమతి సుంకాలను(Customs Duty) తగ్గిస్తూ కేంద్రం(Government) తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 20శాతం ఉన్న దిగుమతి సుంకాలను ఏకంగా సగం.. అంటే 10 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించిది. దీంతో క్రూడ్ పామాయిల్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా తగ్గనుంది.
నేటి నుంచే అమల్లోకి..!
ఈ నిర్ణయం మే 31 నుంచే అమల్లోకి రానున్నట్లు కేంద్ర సర్కారు స్పష్టం చేసింది. దిగుమతి సుంకాల తగ్గింపుతో నూనెల ధరలపై ప్రభావం పడనుంది. మేక్ ఇన్ ఇండియా(Make in India)కు ప్రోత్సాహం అందించడంతో పాటు భారతీయ ఆయిల్ మార్కెట్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గతంలో దిగుమతి సుంకాలు పెంచగానే అమాంతం పెరిగిన ధరలు ఈ నిర్ణయంతో తగ్గుముఖం పట్టనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గతేడాది సెప్టెంబరు 14న కేంద్ర సర్కారు క్రూడ్ ఆయిల్స్‌పై అప్పటికే ఉన్న 0 శాతం దిగుమతి పన్నులను 20శాతం చేసింది. ఇది ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపించి.. ధరలు ఏకంగా 40% పెరిగాయి. అయితే, రిఫైన్డ్ ఆయిల్‌పై 12.5శాతం ఉన్న దిగుమతి సుంకాలను 32.5శాతానికి పెంచింది. దీంతో ఎక్కువ మంది రిఫైన్డ్ ఆయిల్స్ వైపే మొగ్గు చూపారు. ఈ తాజా ప్రకటనతో ఈ పరిస్థితి పూర్తిగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు. రిఫైన్డ్ ఆయిల్స్‌పై పన్ను అలాగే ఉంచిన కేంద్రం కేవలం క్రూడ్ ఆయిల్‌పై మాత్రమే దృష్టి సారించింది. దీంతో భారత నూనె వ్యాపారులు ఇక్కడే క్రూడ్ ఆయిల్ తయారు చేసి మార్కెటకు దోహదపడతారని తెలుస్తోంది. ఏదేమైనా ఇది సామన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇదో ఊరటనే చెప్పొచ్చు.