
IPL 2025: ఐపీఎల్ ఫైనల్ ఎంట్రీకి కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ ఆసాంతం నరాలు తెగే ఉత్కంఠలో (GT vs MI) గుజరాత్ టైటన్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో క్వాలిఫయర్ 2కి వెళ్లిన ముంబై.. జూన్ 1న పంజాబ్‌తో తలపడనుంది.

ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) 50 బంతుల్లో 81 పరుగులతో చేసిన వీర విహారానికి, బెయిర్ స్టో(47), తోడవ్వగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగులు సాధించింది. పవర్ ప్లే మొదలుకొని చివరి ఓవర్ దాకా ముంబై బ్యాటర్లు విధ్వంసకరంగా ఆడారు. సూర్య కుమార్ యాదవ్(33), తిలక్ వర్మ(25), హార్దిక్ పాండ్యా(22) పరుగులు తీశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 4 క్యాచ్‌లు గుజరాత్ ప్లేయర్లు వదిలేయడంతో ముంబైకి కలిసొచ్చింది.

229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ను ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్లనే ఔట్ చేయడంతో ఇక ఆట ముంబై పక్షమే అనుకున్నారంతా.. కానీ, యంగ్ సెన్సేషన్ సాయి సుదర్శన్(80) ఆటను మలుపు తిప్పేశాడు. బుమ్రా, అశ్వనీ, బౌల్ట్, పాండ్యా.. ఇలా ఎవరినీ వదలకుండా అందరి బంతులనూ బాదేశాడు. అతనికి వాషింగ్టన్ సుందర్(48) తోడయ్యాడు.

బుమ్రా వేసిన యార్కర్‌కు సుందర్ వికెట్ల ముందు బోల్తా పడగా.. తర్వాత వచ్చిన రూథర్‌ఫర్డ్, తెవాటియా మంచి ప్రదర్శనే చేశారు. చివరి ఐదు ఓవర్లు మిగిలి ఉండగా.. గుజరాత్ గెలుస్తుందనుకునే సమయంలో వరసగా సుదర్శన్, రూథర్ ఫర్డ్ పెవీలియన్ బాటపట్టారు. చివరి మూడు ఓవర్లలో షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియాలు ప్రయత్నం చేసినా.. ముంబై బౌలర్లు కట్టడి చేశారు. దీంతో 20 పరుగుల తేడాతో ముంబై (Mumbai Indians) విజయం సాధించింది.

ఈ గెలుపుతో క్వాలిఫయర్ 2కి వెళ్లిన ముంబై.. జూన్ 1న పంజాబ్‌తో తలపడనుంది. ఇందులో గెలిచిన టీం ఫైనల్లో ఆర్‌సీబీ(RCB)ని ఢీ కొట్టనుంది.