
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తనయ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో కవిత ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party)ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ వ్యాఖ్యానించారు. తాను రాసిన లేఖను ఎవరు బయట పెట్టాలంటు బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించిన కవిత.. ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు. తాను జైలుకు వెళ్లినప్పుడే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని చెప్పుకొచ్చారు. జాగృతితో కాలికి బలపం పట్టి పార్టీ కోసం పనిచేశానని.. ఇప్పుడు గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 3న జాగృతి తరఫున ధర్నా చేయనున్నట్లు కవిత స్పష్టం చేశారు.
నేను నోరు తెరిస్తే బాగోదని సైలెంట్‌గా ఉంటున్నానని.. నా మీద పడి ఏడిస్తే లాభమేంటని ప్రశ్నించారు. నా సొంత తండ్రికి లేఖ రాస్తే మీకేంటి నొప్పి అన్నారు. తనను పార్టీ నుంచి బయటకి పంపే అంత సీన్ ఎవరికీ లేదంటూ మండిపడ్డారు. ఇంకో ముప్పై ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానని.. కేసీఆరే ఎప్పటికీ తన నాయకుడని స్పష్టం చేశారు. ఈ చిట్‌చాట్ మొత్తంలో పరోక్షంగా కేటీఆర్(KTR)ను టార్గెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్‌లా తాను తిక్కదాన్నని.. ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. 25ఏళ్లుగా తన తండ్రి కేసీఆర్‌కి లేఖలు రాస్తున్నానని.. అవి చదివి ఆయన చింపేసేవారన్నారు. కానీ, ఈసారి మాత్రం తన లేఖ బయటికి ఎలా వచ్చిందో.. ఏం కుట్ర చేయాలనుకున్నారో చెప్పాలంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. పెయిడ్ మీడియా ఛానళ్లు, పత్రికలను వాడి తనపై వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై పార్టీ ఎందుకు స్పందించట్లేదన్నారు.
అయితే, ఇప్పటికే కవిత సొంత పార్టీ పెడుతున్నారంటూ పలు పత్రికల్లో వార్తలొస్తున్నాయి. జూన్ 2న పార్టీకి ముహూర్తం ఫిక్సయిందని.. దీనికి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆరుగురు ఎమ్మెల్యేలను పట్టుకుని వస్తే నాకు మంత్రి పదవి ఇస్తారా అంటూ బేరాలు ఆడినట్లూ వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను నిన్ననే కవిత ఖండించినా.. తనను అడగకుండా రాశారన్నారు. ఎక్కడా ఇవి తప్పు అని స్పష్టం చేయకపోవడంతో వార్తలకు బలం చేకూరుతోంది.