
తండ్రి మరణం తర్వాత వారసత్వంగా ఉద్యోగం పొందేందుకు ఓ మహిళ చేసిన సుధీర్ఘ పోరాటం ఫలించింది. దాదాపు 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఓ కుటుంబంలో కొత్త వెలుగులు నింపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).
వరంగల్(Warangal)కు చెందిన హెడ్ కానిస్టేబుల్ భీం సింగ్ 1996లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. తండ్రి మరణంతో కుటుంబానికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలని ఆయన కుమార్తె రాజ శ్రీ అప్పటి సర్కారుకు విన్నవించుకున్నారు. ప్రయోజనం లేకపోగా.. ఆ తర్వాత మారిన ప్రభుత్వాధినేతల నుంచీ విముఖతే వ్యక్తమైంది.
ఆ తర్వాత కారుణ్య నియామకల్లో భాగంగా ఎంతోమందికి అవకాశం దక్కినా రాజశ్రీకి మాత్రం నిరాశే ఎదురైంది. అయితే, ఇటీవల వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఈ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన సీఎం.. ఆమెకు ఉద్యోగం ఇప్పించాలని సీఎస్‌తో పాటు హోంశాఖ అధికారులను ఆదేశించారు. సీఎం (Telangana CM) ఆదేశాలతో రాజశ్రీకి హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పించారు అధికారులు.
ఈ మేరకు బుధవారం రాజశ్రీ తన కుటుంబంతో సీఎం రేవంత్‌ను కలిసింది. ఈ ఫొటోను ఎక్స్(X)లో పంచుకున్న సీఎం.. తన వల్ల రాజశ్రీకి మంచి జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమస్యను తనదాకా తీసుకొచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును అభినందించారు.