
Hyderabad: బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధికారం కోల్పోగానే కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సీనియర్ లీడర్లు, బీఆర్ఎస్ మాజీ నేతలు ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కోనేరు కోనప్పలపై ఆ పార్టీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen) మండిపడ్డారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుపోటు పొడిచి.. కేవలం అధికారదాహంతో ఫిరాయింపులకు పాల్పడ్డ వీరంతా ద్రోహులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు నేనెప్పుడూ దూరంగానే ఉన్నాను.. తిరిగి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరతానంటూ సోమవారం సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) చేసిన వ్యాఖ్యలకు ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్ ఇచ్చారు. కేవలం కుటుంబ మాఫియాను కాపాడుకునేందుకే, సిగ్గులేకుండా పార్టీ మారారంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మీలాంటి ద్రోహుల వల్లే రాష్ట్రం చీకట్లోకి వెళ్లిందని.. త్వరలోనే కేసీఆర్ తిరిగి అధికారం చేపడతారన్నారు.
వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని పార్టీలోకి తీసుకున్నందుకే బీఆర్ఎస్ ను వీడానంటూ కోనప్ప చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ఇది పచ్చి అబద్ధం-అవకాశవాదం. మీ మీద నాకు వ్యక్తిగతంగా ఏలాంటి కక్షలు ఉండే అవకాశమే లేదు. సిర్పూర్ లో మీ కుటుంబ మాఫియా దౌర్జన్యాలకు చితికిపోయిన తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకున్నారు కాబట్టే నేను తుంగభద్ర తీరం నుండి ప్రాణహితకు వచ్చాను. నిజానికి తమరు ఆఘమేఘాల కాంగ్రేసు తీర్థం పుచ్చుకున్న నాటికి నేను బీఎస్పీ(BSP) రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ గారితో 2024 పార్లమెంట్ ఎన్నికలలో పొత్తు గురించి చర్చలు జరపడానికి వచ్చాను. అంతే …గోతి కాడి నక్కలా ఇదే అదనుగా మీరు కాంగ్రెస్(Congress Party) లోకి జంప్ అయ్యారు అంటూ ఆర్ఎస్ ట్వీట్ చేశారు.
బీఆరెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేసింది? ఆనాడు పార్టీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవచ్చు కదా! మీరు ఆ పని అసలే చేయలేదు. అధికారం ఎక్కడుంటే అక్కడ మీరుండాలి. అప్పుడే మీ మాఫియా విజయవంతంగా నడుస్తుంది. అందుకే మీరు నిస్సిగ్గుగా అధికార కాంగ్రెస్లో చేరారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ గుంట నక్క వ్యవహారాలు మానుకోని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి వారి నుండి దోచుకున్న ఆస్తులను తిరిగి వాపస్ ఇవ్వండి. రాజకీయాల నుండి తప్పుకోండి అంటూ హితవు పలికారు.