
Siricilla: రాజన్న సిరిసిల్లా జిల్లాలోని సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్(KTR) కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫొటో లేకపోవడంతో సీఎం ఫొటో పట్టుకుని సిరిసిల్లా కాంగ్రెస్ (Congress) నాయకులు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఫొటో పట్టుకుని వచ్చిన కాంగ్రెస్ నాయకులున బీఆర్ఎస్ (BRS Party) నాయకులు అడ్డుకున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య తోపులాట జరిగింది. రెండు పార్టీల శ్రేణులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్ల కాంగ్రెస్ బలపడుతోంది. తమ ఉనికిని చాటుకునేందుకు తరచూ స్థానిక బీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తోంది. తరచూ ఏదో ఓ వివాదాన్న సృష్టిస్తూ వస్తున్నారు ఇక్కడి నేతలు. అయితే, క్యాంప్ కార్యాలయం ప్రభుత్వ అధికారిక నివాసం కాబట్టి అక్కడ కచ్చితంగా ప్రభుత్వాధినేతగా సీఎం ఫొటో పెట్టాల్సిందేనని కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నేతలెవరూ పెట్టలేదంటూ బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. సోమవారం ఈ వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో పోలీసులు లాఠీ ఝులిపించక తప్పలేదు. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ఇరు పక్షాలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్లు సమాచారం. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకా స్పందించలేదు.