
తన తండ్రి, బీఆర్ఎస్(BRS Party) అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Ex CM KCR) చుట్టూ దయ్యాలున్నాయని కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడు లాంటివారని ఆయన చుట్టూ చేరిన దయ్యాల వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ కు కవిత లేఖ రాశారంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. ఆ లేఖ తానే రాశానని.. ఆ లేఖను లీక్ చేయడం వెనక కొందరి కుట్ర ఉందంటూ మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు.
రెండు వారాల క్రితమే లేఖ (Letter to KCR) రాశానని.. పార్టీలో నాయకులు ఏమనుకుంటున్నారో అవి మాత్రమే ఓ సూచనలా రాశానని కవిత స్పష్టం చేశారు. ఆ లేఖను కావాలనే కొందరు ఇప్పుడు బయటకి తీసుకొచ్చారు. ఇది మా పార్టీలో ఉన్నవారే చేశారు. దాని వెనకాల ఎవరున్నారనే విషయాలు బయటికి వచ్చి తీరాలంటూ కవిత చెప్పారు. పార్టీలో నా పరిస్థితే ఇలా ఉంటే మిగతా వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. మా నాయకుడు కేసీఆర్ మాత్రమేనని.. ఆ లేఖ రాయడం వెనక మరింకే అజెండా లేదని కవిత స్పష్టం చేశారు.
