దుబాయ్: ఉద్యోగాల కల్పనలో తెలంగాణా సంస్థ టీ కన్సల్ట్(T-Consult) మరో కీలక ముందడుగు వేసింది. ఏళ్లుగా వివిధ అంతర్జాతీయ వేధికలపై భారత్(India) లో ఉద్యోగాల కల్పన(New Jobs), ఆవిష్కరణలు(Innovations), అంకుర సంస్థల(Startups)కు ప్రోత్సాహకాల విషయంపై చర్చలు, ఒప్పందాలు చేస్తున్న టీ-కన్సల్ట్ ఇప్పుడు మరో అంతర్జాతీయ ఐటీ కన్సల్టింగ్ సంస్థ(Consulting Firm) యూనిక్ హైర్‌తో కలిసి దుబాయ్ వేధికగా పనిచేయనుంది.
భారతీయ నిపుణులతో పాటు అంతర్జాతీయంగా వివిధ దేశాల నిపుణులను దేశీయ స్టార్టప్‌లకు సేవలందించే అవకాశం కల్పించనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)కు వ్యాపార అభివృద్ధి సహాయక సంస్థగా కొనసాగుతున్న టీ-కన్సల్ట్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న యూనిక్ హైర్ ఇప్పుడు దుబాయ్‌కి కేంద్రాలను విస్తరించింది. ఈ మేరకు టీ-కన్సల్ట్ ఛైర్మన్ సందీప్ మక్తల(Sundeep Makthala), ఎమిరాటీ వ్యాపారవేత్త డాక్టర్ బు అబ్దుల్లాలు సంయుక్తంగా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనిక్ హైర్ యూఏఈ లోగోను ఆవిష్కరించారు.
యూనిక్ హైర్ ఎండీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. టీ కన్సల్ట్, డాక్టర్ బు అబ్దుల్లాల మద్దతుతో ఈ మైలురాయి చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ భాగస్వామ్యం నూతన ఆవిష్కరణలతో పాటు అంతర్జాతీయంగా తమ సంస్థకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు.
నైపుణ్యాల్ని సానబెట్టి.. పని నాణ్యత పెంచేలా!
10వేల మంది అంతర్జాతీయ అభ్యర్థులను ఎంపిక చేసుకుని, వారికి నైపుణ్యాలు సమకూర్చి ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రణాళికతో ఈ కంపెనీ ఆసియాతో పాటు పలు దేశాల్లోని కీలక విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోనుంది. అంతర్జాతీయ విద్యార్థులకు అత్యాధునిక శిక్షణనందించి వారికి సాంకేతిక రంగంలో ఇంటర్న్‌షిప్ అవకాశాలూ కల్పించనుంది. దీనివల్ల ఆవిష్కరణలు పెరగడమే కాకుండా.. అంతర్జాతీయ నైపుణ్యాలను భారత అంకుర సంస్థలు వినియోగించుకునే అవకాశం ఉంటుందని.. దానివల్ల పని నాణ్యత పెరుగుతుందని టీ కన్సల్ట్ ఛైర్మన్ సందీప్ మక్తల అన్నారు.