
Hyderabad: నూతనంగా లైసెన్సులు పొందిన పరిశ్రమల నిర్వాహకులు, క్వాలిటీ ఇన్‌ఛార్జులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) BIS హైదరాబాద్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం మౌలాలీలోని సంస్థ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మానక్ సంవాద్ పేరిట ప్రతినెలా జరుగుతున్న ఈ కార్యక్రమంలో నూతనంగా బీఐఎస్ లైసెన్సులు పొందిన సంస్థలకు.. భారతీయ ప్రమాణాలు పాటించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీఐఎస్ నిబంధనలు, బీఐఎస్ డిజిటల్ వేధికలకు సంబంధించిన అన్ని వివరాలను చెబుతున్నామని బీఐఎస్ శాఖధిపతి పీవీ శ్రీకాంత్ అన్నారు. ఐఎస్ఐ(ISI) మార్కుకు ఉన్న ప్రతిష్టను కాపాడటంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు అందించడం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. అనంతరం బీఐఎస్ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ సవిత.. టెక్నికల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో బీఐఎస్‌తో సమన్వయం ఎలా చేసుకోవాలి, బీఐఎస్ కేర్ యాప్, ఈ-బీఐఎస్, మానక్ ఆన్‌లైన్ ల పనితీరు గురించి వివరించారు. స్టాండర్డ్స్ వాచ్(Standards Watch) పేరిట ప్రతీ వారం యూట్యూబ్‌లో బీఐఎస్ చేస్తున్న వార్తా బులెటిన్లను ప్రతీ ఒక్కరూ చూడాలని.. దాని ద్వారానే బీఐఎస్ లో జరిగే ప్రతీ విషయం తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపు 40 మంది లైసెన్సీదారులు పాల్గొన్నారు.