ఇవి రైల్వే స్టేష‌న్లా.. ఎయిర్ పోర్టులా..?

Share this article

Hyderabad: తెలంగాణాలో రైల్వే స్టేష‌న్ల రూపురేఖ‌లు మారిపోతున్నాయి. ఎయిర్‌పోర్టుల‌ను త‌ల‌పించేలా ఆధునిక సొబగుల‌ద్దుకుని మెరిసిపోతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన అమృత్ భార‌త్ స్టేష‌న్ స్కీం(ఏబీఎస్ఎస్‌) ప‌థ‌కం కింద దాదాపు రూ.2,750కోట్ల‌తో 40 రైల్వే స్టేష‌న్లను అధునాత‌నంగా తీర్చిదిద్దుతోంది భార‌త రైల్వే శాఖ‌. ఇందులో రాష్ట్రంలోని వ‌రంగ‌ల్‌(Warangal), కరీంన‌గ‌ర్‌(Karimnagar), బేగంపేట రైల్వే స్టేష‌న్లున్నాయి. బేగంపేట(Begumpet) రూ.26.55కోట్లు, క‌రీంన‌గ‌ర్ రూ.25.85కోట్లు, వరంగ‌ల్ స్టేష‌న్‌ను రూ.25.41కోట్ల‌తో పున‌ర్మించారు. అమృత్ ప‌థ‌కంలో భాగంగా హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే చ‌ర్ల‌ప‌ల్లి పున‌రుద్ధ‌ర‌ణ పూర్త‌వ‌గా.. సికింద్రాబాద్ పున‌ర్నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్నాయి. న‌గ‌రం నుంచి ప్ర‌యాణీకుల సౌక‌ర్యం కోసం బేగంపేట‌ను మ‌రో అత్యాధునిక కేంద్రంగా రైల్వే మార్చింది. ఇక్క‌డి నుంచి నిత్యం 100కు పైగా రైళ్లు రాక‌పోక‌లు సాగిస్తున్నాయి. స్థానిక స్టేష‌న్ అయినా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లూ ఆగుతాయి. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని రైళ్ల‌ను ఇక్క‌డ నుంచి ప్రారంభించేందుకు రైల్వే క‌స‌ర‌త్తులు చేస్తోంది.

క‌రీంన‌గ‌ర్‌.. ఏళ్ల క‌ల‌!
ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లావాసుల‌కు ఇక్క‌డి రైల్వే స్టేష‌న్ ఆధునీక‌ర‌ణ ఓ క‌ల‌. దూర‌ప్రాంతాలు చేయాల‌నుకునేవారికి సికింద్రాబాద్‌, మంచిర్యాల కేంద్రాలు మిన‌హాయించి మ‌రో స్టేష‌న్ అందుబాటులో లేదు. కేవ‌లం తిరుప‌తి, మ‌రో 9 రైళ్లు మిన‌హా వేటికీ క‌రీంన‌గ‌ర్ నుంచి స‌దుపాయం లేదు. ఇప్పుడు రూ.25.85కోట్ల‌తో రూపుదిద్దుకున్న ఈ స్టేష‌న్ ఎయిర్‌పోర్టును త‌ల‌పిస్తోంది. ఇక్క‌డి నుంచి మ‌రిన్ని రైళ్లు న‌డిపేందుకు రైల్వే శాఖ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తోంది. విశాల‌మైన‌ వెయిటింగ్ హాల్, బుకింగ్ కార్యాల‌యం, దివ్యాంగుల‌కు ప్ర‌త్యేక స‌దుపాయాలు, ల్యాండ్ స్కేపింగ్‌, ప్లాట్‌ఫామ్‌ల‌పై కొత్త షెల్ట‌ర్లు, సోలార్ విద్యుత్తు ప్లాంటు, ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జ్‌లు, లిఫ్ట్ లు, ఎస్క‌లేట‌ర్ల‌తో కొత్త‌హంగుల‌ద్దుకుందీ స్టేష‌న్‌.

రాష్ట్రంలో కీల‌క న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ నుంచి రోజూ 150 దాకా రైళ్లు రాక‌పోక‌లు సాగిస్తున్నాయి. దాదాపు 25వేల మంది ప్ర‌యాణీకులు ఇక్క‌డి నుంచి వెళ్లి వ‌స్తున్నారు. ఈ స్టేష‌న్‌ని సైతం ఓరుగల్లు కోట‌ను త‌లపించే ప్ర‌ధాన భ‌వ‌నం, అధునాత‌న సౌక‌ర్యాల‌తో వెయిటింగ్ హాల్‌.. ఇలా ఎన్నో వ‌స‌తులతో రూపుదిద్దుకుంది వ‌రంగ‌ల్ స్టేష‌న్‌.జ

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *