
Hyderabad: మూడంచెల భద్రత.. అడుగు లోపలికి పెట్టాలంటే ముందస్తు అనుమతులు.. అడుగడుగునా సెక్యురిటీ వ్యవస్థ.. ఇవన్నీ దాటుకొని ఓ దొంగ తన చేతికి పని చెప్పాడు. ఎక్కడో కాదు తెలంగాణా ప్రథమ పౌరుడు, గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్(Rajbhavan)లో. సోమాజిగూడ రోడ్డులో ఉన్న ఈ భవనంలో ఓ ఆగంతకుడు చొరబడి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మే 14న రాత్రి హెల్మెట్ ధరించి రాజ్‌భవన్ సుధర్మ భవన్‌లోకి చేరుకున్న ఓ ఆగంతకుడు.. మొదటి అంతస్థులోని కంప్యూటర్ రూమ్‌కి చేరుకున్నాడు. అక్కడ కీలక ఫైళ్లున్న, విలువైన నాలుగు హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లాడు.
దీనిపై రాజ్‌భవన్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీలను పరిశీలిస్తున్నారు. చోరీకి గురైన ఈ నాలుగు డిస్కుల్లో రాజ్‌భవన్ వ్యవహారాలకు సంబంధించిన సమాచారంతో పాటు కొన్ని కీలక నివేధికలు ఉన్నట్లు సమాచారం. అయితే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి బయటి వాళ్లు లోపలికి వెళ్లే అవకాశం లేనందున.. ఇంటిదొంగల పని ఉందేమో అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.