
Hyderabad: భారత రక్షణ రహస్యాలు, దేశంలోని ప్రముఖ ప్రాంతాల వివరాలను ఎప్పటికప్పుడు తన వీడియోల ద్వారా పాకిస్థాన్ ఐఎస్ఐ(ISI)కి చేరవేసిన కేసులో అరెస్టైన హర్యాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyothi Malhotra) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడితో పాటు చాలా ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ లోపాలు, ఎక్కడ ఏముందనే విషయాన్ని తన వీడియోల ద్వారా పాక్ కు సమాచారం అందించినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఆమె హైదరాబాద్ టూర్ కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
నిన్న సాయంత్రం ఒడిశా యూట్యూబర్ ప్రియాంక సేనాపతిని అరెస్టు చేసిన పోలీసులు.. జ్యోతికి సంబంధించిన అన్ని వీడియోలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చినట్లు తెలిసింది. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) వర్చువల్గా ప్రారంభించిన వందే భారత్ (Vande Bharath) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అశ్వనీ వైష్ణవ్ సహా అప్పటి గవర్నర్ తమిళిసై ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో అన్ని వీడియోలు కవర్ చేసిన జ్యోతి.. వందే భారత్ లోపల కూడా పూర్తి వివరాలను తన వీడియోలో పంచుకున్నారు. ఇక్కడ ఎవరెవరిని కలిసింది.. ఎక్కడెక్కడికి వెళ్లిందనే అంశాలపై సైతం విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.