
Delhi: ఇన్‌స్టాగ్రామ్(Instagram), యూట్యూబ్(Youtube), ఫేస్‌బుక్(Facebook).. యువతకు ఇప్పుడివి ఈజీ ఆధాయ మార్గాలు. వెర్రికి వెయ్యి తలలుంటే.. ఆ వెయ్యి తలలూ ఇక్కడే కనిపిస్తాయి. ఫాలోవర్లు పెంచుకునేందుకు, సెలబ్రిటీలయ్యేందుకూ చేయని పని లేదు. ఈజీ మనీ కోసం మత్తు, గంజాయ్, అశ్లీలత, బెట్టింగ్ యాప్‌లు, ఫేక్ ప్రమోషన్లే కాదు ఇప్పుడు దేశ ద్రోహానికీ వెనకాడట్లేదు కొందరు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు. హర్యాణాకు చెందిన జ్యోతీ మల్హోత్ర(Jyothi Malhotra)దీ అదే తోవ. డబ్బుకు ఆశపడి దేశ రక్షణ వ్యవస్థ, ఆర్మీకి సంబంధించిన సున్నిత విషయాలను పాక్ ఐఎస్ఐకి చేరవేసిందీ యూట్యూబర్. ఇప్పటికే ఈమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా.. ఈమెతో భారత్‌లోని పలు రాష్ట్రాలకు చెందిన యూట్యూబర్లు సన్నిహితంగా ఉన్నట్లు ఇంటలిజెన్స్ విభాగం గుర్తించింది. ఆమె సోషల్ మీడియా ఖాతాలతో పాటు, యూట్యూబ్‌ను సైబర్ నిపుణులతో క్షుణ్ణంగా గాలిస్తోన్న అధికారులు.. ఏయే సమయాల్లో ఎక్కడెక్కడకి వెళ్లింది.. ఎవరెవరిని కలిసిందీ అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

అయితే, ఆమె ట్రావెలర్‌గా వీడియోలు తీస్తూ దేశంలోని ప్రతీ కీలక పర్యాటక ప్రాంతాన్నీ పర్యటించింది. ఈ క్రమంలో 2024 సెప్టెంబరు 26న ఒడిశాకు చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతి(Priyanka Senapathi)తో కలిసి పూరీ శ్రీక్షేత్రంతో పాటు అక్కడి స్థానిక పర్యాటక కేంద్రాలను తిరిగివచ్చింది. అయితే, ఈ ట్రిప్ ముగిసిన కొద్దిరోజులకే ప్రియాంక సైతం జ్యోతితో కలిసి పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ వెళ్లివచ్చింది. దీంతో ప్రియాంకపై నిఘా పెట్టిన కేంద్ర నిఘావర్గాలు ఒడిశా పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో ఒడిశా ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ప్రియాంకను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. అయితే, కొద్దిరోజుల క్రితం పూరీ జగన్నాథ్ ఆలయం వద్ద ఉగ్రవాదుల కార్యకలాపాలపై కేంద్ర నిఘావర్గాలకు సమాచారం అందింది. అయితే ఏజెంట్ జ్యూతీ మల్హోత్ర జగన్నాథ్ దర్శనానికే వచ్చారా లేక ఇక్కడి సమాచారం ఏదైనా అందించేందుకు రెక్కీ చేశారా అన్న కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఉచ్చులో ఇప్పుడు ప్రియాంక సేనాపతితో పాటు దేశంలోని పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపైనా పోలీసులు నిఘా పెట్టారు. గత రెండేళ్లలో తరచూ పాకిస్థాన్ వెళ్లివచ్చిన, కీలక ప్రాంతాల్లో ట్రావెలింగ్ వీడియోలు తీసిన వారిపైనా దృష్టి సారిస్తున్నారు.