
Hyderabad: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఎట్టకేలకు వీరమల్లు రాకను ఫైనల్ చేసిందీ చిత్ర బృందం. జూన్ 12న హరిహర వీరమల్లు థియేటర్లలో కనిపిస్తాడని శుక్రవారం ప్రకటించింది. రెండేళ్లుగా సినిమాలను పక్కనపెట్టి రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు పవన్. 2023లో వచ్చిన బ్రో సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. మొదలుపెట్టిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు ఎన్నికలతో ఆగిపోయాయి.
మార్చి 28న విడుదల అవ్వాల్సిన వీరమల్లు.. పవన్ నటించాల్సిన కొన్నికీలక యాక్షన్ సన్నివేశాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత మే 9 న కొత్త విడుదల తేదీని ప్రకటించినా విడుదల కాలేదు. గత వారం రోజులుగా షూటింగ్‌లో పాల్గొన్న పవన్ మిగతా సీన్లన్నీ పూర్తిచేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత బృందం సామాజిక మాధ్యమాల్లో పలు ఫొటోలు పంచుకుంది. చిత్రీకరణ పూర్తయిందని.. త్వరలోనే థియేటర్లలో ఆయన విన్యాసాలు ఆకట్టుకుంటాయని తెలిపింది.