Gold: ఈ జిల్లాల్లో ఇలా అమ్మితే జైలే!

Share this article

Hyderabad: బంగారం భ‌గ‌భ‌గా మండుతోంది. భార‌త్‌లో గ‌రిష్ఠ ధ‌ర ఏకంగా 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.95,130కి చేరుకుంది. గ‌త రెండు రోజులుగా కాస్త త‌గ్గుతున్న‌ట్లు క‌నిపించినా.. శుక్ర‌వారం ఒక్క‌రోజుకే రూ.1200 పెరిగి మ‌రోసారి అత్య‌ధిక ధ‌ర ప‌లుకుతోంది.

22 క్యారెట్ల(22carat gold) బంగారం 10 గ్రాముల‌కు రూ.1100 పెరిగి రూ.87200 వ‌ద్ద కొన‌సాగుతోంది. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కైతే ఇది మోయ‌లేని బ‌రువే. అయితే, ఈ పెళ్లిళ్ల సీజ‌న్‌లో బంగారం కొన‌డం త‌ప్ప‌నిస‌రిగా మారింది. వ‌ధువు, వ‌రుడి కోస‌మైనా క‌నీసం 5 నుంచి 10 తులాల బంగారాన్ని కొనే ఆన‌వాయితీ భార‌త కుటుంబాల్లో కొన‌సాగుతూనే ఉంది. కానీ, ఎంత మూల్యానికి..? ఇన్ని ల‌క్ష‌లు వెచ్చించి కొనే బంగారం న‌కిలీదైతే..? శుద్ధ‌త లేని ఆభ‌ర‌ణాల‌ను మ‌న‌కు అంట‌గడితే..? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగానే భార‌తీయ ప్ర‌మాణాల బ్యూరో(బీఐఎస్‌-BIS) హాల్‌మార్కింగ్(Hallmarking) ను 2022లో ప్ర‌వేశ పెట్టింది.

ద‌శ‌ల వారీగా దేశంలోని 361 జిల్లాల‌ను ఒక్కొక్క‌టిగా హాల్‌మార్కింగ్‌ను త‌ప్ప‌నిస‌రి(Mandatory) చేస్తూ వ‌చ్చింది. ఈ జిల్లాల్లో హాల్‌మార్కింగ్ లేకుండా అమ్మితే రూ.5ల‌క్ష‌ల దాకా జ‌రిమానాతో పాటు 5ఏళ్ల జైలుశిక్ష ప‌డే అవ‌కాశ‌ముంది. మ‌న తెలంగాణా, ఏపీల్లో బంగారానికి హాల్‌మార్కింగ్ త‌ప్ప‌నిస‌రి నిబంధ‌న ఉన్న జిల్లాలు ఇవే..

తెలంగాణలో తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలైన జిల్లాలు:

  1. హైదరాబాద్ – జూన్ 23, 2021 (మొదటి దశ)
  2. రంగారెడ్డి – జూన్ 23, 2021 (మొదటి దశ)
  3. మేడ్చల్ మల్కాజ్‌గిరి – సెప్టెంబర్ 8, 2023 (మూడవ దశ)
  4. కరీంనగర్ – సెప్టెంబర్ 8, 2023 (మూడవ దశ)
  5. మంచిర్యాల – జూన్ 23, 2021 (మొదటి దశ)
  6. ఖమ్మం – జూన్ 23, 2021 (మొదటి దశ)
  7. నల్గొండ – జూన్ 23, 2021 (మొదటి దశ)
  8. పెద్దపల్లి – జూన్ 23, 2021 (మొదటి దశ)
  9. వరంగల్ – జూన్ 23, 2021 (మొదటి దశ)
  10. హన్మకొండ – జూన్ 23, 2021 (మొదటి దశ)
  11. మహబూబ్‌నగర్ – సెప్టెంబర్ 8, 2023 (మూడవ దశ)
  12. నిజామాబాద్ – సెప్టెంబర్ 8, 2023 (మూడవ దశ)
  13. భద్రాద్రి కొత్తగూడెం – జూన్ 23, 2021 (మొదటి దశ)

ఆంధ్రప్రదేశ్‌లో తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలైన జిల్లాలు:

  1. అనంతపూర్ – జూన్ 23, 2021 (మొదటి దశ)
  2. అన్నమయ్య – సెప్టెంబర్ 8, 2023 (మూడవ దశ)
  3. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ – సెప్టెంబర్ 8, 2023 (మూడవ దశ)
  4. తూర్పు గోదావరి – జూన్ 23, 2021 (మొదటి దశ)
  5. ఏలూరు – సెప్టెంబర్ 8, 2023 (మూడవ దశ)
  6. గుంటూరు – జూన్ 23, 2021 (మొదటి దశ)
  7. కడప – జూన్ 23, 2021 (మొదటి దశ)
  8. కృష్ణా – జూన్ 23, 2021 (మొదటి దశ)
  9. కర్నూలు – జూన్ 23, 2021 (మొదటి దశ)
  10. ఎన్టీఆర్ – సెప్టెంబర్ 8, 2023 (మూడవ దశ)
  11. నంద్యాల – సెప్టెంబర్ 8, 2023 (మూడవ దశ)
  12. నెల్లూరు – జూన్ 23, 2021 (మొదటి దశ)
  13. పల్నాడు – నవంబర్ 5, 2024 (నాలుగవ దశ)
  14. ప్రకాశం – జూన్ 23, 2021 (మొదటి దశ)
  15. శ్రీకాకుళం – జూన్ 23, 2021 (మొదటి దశ)
  16. విశాఖపట్నం – జూన్ 23, 2021 (మొదటి దశ)
  17. విజయనగరం – జూన్ 23, 2021 (మొదటి దశ)
  18. పశ్చిమ గోదావరి – జూన్ 23, 2021 (మొదటి దశ)

ఈ విధంగా, తెలంగాణలో 13 జిల్లాలు మరియు ఆంధ్రప్రదేశ్‌లో 18 జిల్లాల్లో బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయబడింది. వినియోగదారులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో హాల్‌మార్క్‌తో పాటు HUID నంబర్‌ను కూడా తనిఖీ చేయడం ద్వారా తమ కొనుగోలు యొక్క నాణ్యతను నిర్ధారించుకోవచ్చు.

హాల్‌మార్కింగ్ అంటే..?
ప్ర‌తీ బంగారు ఆభ‌ర‌ణంపై బీఐఎస్ లోగోతో పాటు ఆ ఆభ‌ర‌ణం యొక్క‌ ప్యూరిటీ(23కే958, 22కే916, 20కే833, 18కే750, 14కే585) మ‌రియూ బీఐఎస్ ధ్రువీక‌రించే హెచ్‌యూఐడీ(హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేష‌న్ నంబ‌రు).. ఈ మూడింటినీ ముద్రించాల్సి ఉంటుంది. గ‌తంలో బీఐఎస్ లోగో, ప్యూరిటీ, అసేయింగ్ సెంట‌ర్ లోగో, జువెల‌రీ షాప్ లోగో మాత్ర‌మే ముద్రించినా అనుమ‌తించేవారు. కానీ, హాల్మార్కింగ్ త‌ప్ప‌నిస‌రి అయిన త‌ర్వాత హెచ్‌యూఐడీ లేకుండా బంగారు ఆభ‌ర‌ణం మార్కెట్లోకి రాకూడ‌దనే నిబంధ‌న భార‌త ప్ర‌భుత్వం పెట్టింది.

హాల్‌మార్కింగ్ లేకుంటే..?
ఈ త‌ప్ప‌నిస‌రి హాల్‌మార్కింగ్ ఉన్న తెలంగాణాలో 13, ఏపీలో 18జిల్లాల్లో బంగారు ఆభ‌ర‌ణాలు హెచ్‌యూఐడీ గానీ, హాల్‌మార్కింగ్‌లో చెప్పిన మూడు ముద్రించకుండా విక్ర‌యించినా, నిల్వ చేసినా.. బీఐఎస్ వారిపై క‌ఠిన చ‌ర్య‌లు చేపడుతోంది. రూ.1ల‌క్ష‌ల నుంచి రూ.5ల‌క్ష‌ల దాకా జ‌రిమానా, 1 ఏడాది నుంచి 5 ఏళ్ల దాకా జైలుశిక్ష‌, లేదా రెండూ శిక్ష‌లు ప‌డే అవ‌కాశం ఉంది. ఉల్లంఘించిన ఓ దుకాణంపై ఇటీవ‌లే దాడులు చేసిన బీఐఎస్ అధికారులు రూ.6కోట్ల విలువైన బంగారు ఆభ‌రణాల‌ను సీజ్ చేశారు.

హాల్‌మార్కింగ్ ఉన్నా మోస‌పోతే..?
బీఐఎస్ ధ్రువీక‌రించిన హాల్‌మార్కింగ్ ముద్ర‌ణ‌లోనూ మోసం జ‌రిగితే.. మీరు కొనే స‌మ‌యానికి హాల్‌మార్కింగ్ మీ జిల్లాలో త‌ప్ప‌నిస‌రి నిబంధ‌న‌గా ఉండి బంగారంలో ప్యూరిటీ త‌క్కువ ఉన్న‌ట్లు గుర్తిస్తే మీరు న‌ష్ట‌పోయిన క్యారెట్ల‌కు రెండు రెట్లు బంగారం మీకు తిరిగి అందుతుంది. దానికి బీఐఎస్ అధికారుల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

కొనేముందు ఏం చేయాలి..?
వినియోగ‌దారుల స్వావ‌లంభ‌న కోసం బీఐఎస్ కేర్ యాప్‌ను బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ అందుబాటులోకి తెచ్చింది. బంగారం కొన‌డానికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డి సిబ్బందిని హాల్‌మార్కింగ్ గురించి క‌చ్చితంగా అడ‌గాలి.. ఆ ఆభ‌ర‌ణంపై ఉన్న ఆరంకెల హెచ్‌యూఐడీ నంబ‌రును బీఐఎస్ కేర్ యాప్‌లో వెరిఫై హెచ్‌యూఐడీ విభాగంలో ఎంట‌ర్ చేసి మీ బంగారం నిజ‌మైన హాల్‌మార్కింగ్ అయ్యిందా లేదా.. ఎంత ప్యూరిటీ ఉంద‌నే విష‌యాలు తెలుసుకోవ‌చ్చు. ఒక‌వేళ మీరు కొనాల‌నుకున్న ఆభ‌ర‌ణం హాల్‌మార్కింగ్ లేక‌పోయినా, ఉండి కూడా ప్యూరిటీలో తేడాలున్నా అదే యాప్ ద్వారా బీఐఎస్ కి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అధికారులు ఆ దుకాణ‌దారుడిపై చ‌ర్య‌లు తీసుకుంటారు.

#GoldHallamarking #GoldPurity #GoldRateToday #Hyderabad #Telagana #Andhrapradesh #BIS, HUID

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *