
Hyderabad: హైదరాబాద్ రోడ్లపై లగ్జరీ కార్లను చూసి హవ్వా ఏమున్నాయని నోరెళ్లబెట్టే ఉంటారు. రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార రంగాల్లో బడా బాబులు వాడే ఈ కార్ల వెనక ఉన్న ఈ ఖరీదైన మోసాన్ని చూస్తే కూడా నోరెళ్లబెట్టాల్సిందే. అవును, హైదరాబాద్‌లో ఈ లగ్జరీ కార్ల(Luxury Cars) పేరిట దాదాపు రూ.వందల కోట్ల మోసం(Scam) జరిగిందని రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఇందులో పలువురు ప్రముఖులూ భాగం పంచుకున్నట్లు సమాచారం. ఇదే కేసులో నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, గచ్చిబౌలిలోని కార్ లాంజ్(Car Launge) షోరూం యజమాని బషారత్ ఖాన్‌ను(Basharath Khan) అరెస్టు చేశారు.
గచ్చిబౌలి, హైటెక్‌సిటీ దారిలో ఉండే కార్‌లాంజ్ షోరూం ఇంపోర్టెడ్ కార్ల వ్యాపారం చేస్తోంది. విదేశాల నుంచి తీసుకొచ్చిన బ్రాండెడ్ కార్లకు మార్పులు చేసి ఇక్కడి ప్రముఖులు, రాజకీయ నాయకులకు అమ్ముతోంది. అయితే, ఈ కార్ల దిగుమతిలో కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతో పాటు 50% ధరను తగ్గించి తప్పుడు బిల్లులతో కస్టమ్స్ అధికారులను తప్పుదోవ పట్టించినట్లు ఇంటలిజెన్స్ సమాచారం అందుకున్న డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు నగరంలో సోదాలు నిర్వహించి బషారత్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరుగుతోంది..?
అమెరికా(America), జపాన్(Japan) తో తయారయ్యే కార్లను మొదట సముద్ర మార్గం గుండా దుబాయ్(Dubai), శ్రీలంక(Srilanka)కు తరలిస్తున్నారు. అక్కడ ఎడమ చేతి డ్రైవింగ్(LHD) నుంచి కుడిచేతి డ్రైవింగ్(RHD) కి మార్పులు చేసి.. ఆ తర్వాత ఆ కార్లను భారత దేశానికి తక్కువ విలువ చూపించే నకిలీ పత్రాలతో దిగుమతి చేస్తున్నారు. ఆ కార్లను ఇక్కడి ప్రముఖులకు తక్కువ ధరలకు అమ్మి సొమ్ము పోగేసుకుంటున్నారు. రూ.20కోట్ల విలువైన కారును రూ.8కోట్ల కారుగా పత్రాలు సృష్టించి.. ఆ డబ్బులకు మాత్రమే కస్టమ్స్ సుంకాలు చెల్లిస్తున్నారు. ఇలా ఇప్పటికి రూ.100కోట్లు కేవలం ఈ కేంద్రం నుంచే జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఏ కార్లు..?
హమ్మర్ ఈవీ, క్యాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, లింకన్ నావిగేటర్ వంటి 30 రకాల కార్లు ఈ లిస్టులో ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో ముంబై, పుణె, బెంగళూరు, దిల్లీలో ఉన్న పలువురు సెలబ్రిటీ కస్టమర్ల హస్తం ఉందని తెలుస్తోంది. వారిపై అధికారలు నిఘా పెట్టారు.
నగర ప్రముఖులకు ఉచ్చు!
ఇటీవలె 8 కార్లను దిగుమతి చేస్తూ.. రూ.7కోట్ల కస్టమ్స్ సుంకాన్ని తప్పించుకుని బషారత్ అధికారులకు చిక్కారు. ఈ కార్లను హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రముఖులు ముందస్తు బుకింగ్ చేసున్నారని సమాచారం. కొందరు కీలక నాయకులకు నిందితుడు ఫ్రీగా కార్లను అందించినట్లు సమాచారం. అరెస్టు అనంతరం అతడిని అహ్మదాబాద్ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు అతడికి జ్యూడిషియల్ కస్టడీ విధించింది. బషారత్ షోరూమ్ వెనక ఉన్న ఇన్ హౌజ్ వర్క్‌షాప్ ఉంది. అక్కడే అనేక కార్ల మాడిఫికేషన్, కొత్త పరికరాలు అమర్చినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకూ బషారత్ ఎవరెవరికి కార్లు అమ్మాడనే దానిపై డీఆర్ఐ విచారిస్తోంది. పలువురు ప్రముఖులూ ఈ ఉచ్చులో చిక్కుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.