Delhi: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు(Supreme Court) 52వ ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)గా బుధవారం జస్టిస్ భూషన్ రామకృష్ణ గవాయ్(Justice Gavai) బాధ్యతలు చేపట్టారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేధికగా దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

భారత సుప్రీం కోర్టు చరిత్రలో జస్టిస్ గవాయ్ తొలి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి కాగా.. రెండో దళిత వ్యక్తి. ఇప్పటివరకూ ఈ పదవిని దళిత సామాజిక వర్గం నుంచి కేజీ బాలకృష్ణన్ మాత్రమే చేపట్టారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన గవాయ్, 1985లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2003లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. దీర్ఘకాలం న్యాయరంగంలో సేవలందించిన ఆయన, పలు కీలక తీర్పుల్లో భాగమయ్యారు.
రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారంలో ప్రధాని మోదీ(PM Modi) సహా మంత్రులు, కీలక నేతలు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం, జస్టిస్ గవాయ్ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

జస్టిస్ గవాయ్ పదవీకాలం 2025 నవంబర్ 23 వరకు ఉంటుంది. ఈ కాలంలో ఆయన సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న 81,000 కేసులు, న్యాయవ్యవస్థలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల నియామకం వంటి కీలక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది.