ఈ కథనం, గణాంకాలు ఓజీ ఎక్స్‌క్లూజివ్

India-Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలోని కీలక నేతలు, వ్యాపారవేత్తలు, పౌరులు దేశం వదిలి పారిపోతున్నారు. ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కచ్చితంగా ప్రతిదాడి చేసి తీరతామని హెచ్చరించడంతో పాటు సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మొహరించింది. దాయాదిపై పలు ఆంక్షలు విధించింది. యుద్ధం కచ్చితంగా వచ్చి తీరుతుందంటూ స్వయంగా పాకిస్థాన్ రక్షణ మంత్రితో సహా కీలక అధికారులు ప్రకటన చేశారు. పూర్తి పాకిస్థాన్ సైన్యాన్ని భారత్ సరిహద్దులకు చేర్చారు. యుద్ధాన్ని ముందే పసిగట్టిన పలువురు పాక్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు, పౌరులు ఇతర దేశాలకు పలాయనమైనట్లు సమాచారం. యూకే ఎంబసీకి చెందిన ఓ సీనియర్ అధికారి ఓజీతో ఈ విషయాలు స్పష్టం చేశారు.
పాకిస్థాన్ లోని ప్రధాన ఎయిర్‌పోర్టులైన కరాచీ(Karachi), పెషావర్(Peshawar), ఇస్లామాబాద్(Islamabad), లాహోర్(Lahore), పిండి(Pindi) ఎయిర్ పోర్టుల నుంచి రోజూ 35 వేల మంది ప్రయాణికులు వివిద దేశాలకు చేరుకున్నారు. అయితే, సాధారణంగా పాకిస్థాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య రోజుకి 22వేలు మాత్రమే ఉంటుంది. 2023, 2024, 2025 మార్చి నెలాఖరు వరకూ 22వేలకు మించి ప్రయాణీకులు దేశం దాటలేదు.
ఒకేసారి 25% పెరిగి..!
ఏప్రిల్ చివరి వారంలో పాకిస్థాన్‌లోని పలు దేశాల ఎంబసీ కార్యాలయాలకు వీసా అప్లికేషన్లు పోటెత్తాయి. ఇందులో బ్రిటన్(యూకే), దుబాయ్, సౌదీ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. సాధారణం కంటే 25శాతం ఎక్కువ కొత్త అప్లికేషన్లు వచ్చినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రయాణీకుల్లో 20శాతం పెరుగుదల కనిపించిందని తెలిపారు.

గత వారంలో రద్దీల వారీగా పాక్ విమానాశ్రయాలు:
- జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ – కరాచీ (KHI), 2. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ISB), 3. అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ – లాహోర్ (LHE), 4. బెనజీర్ భుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ – పిండీ, 5. ఫైసలాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (LYP), 6. సియాల్కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (SKT).
లాహోర్ టు లండన్ వయా ఇరాన్!
మే 6 అర్ధరాత్రి 1:40గంటలకు భారత సైనిక దళాలు వైమానిక దాడి జరిపే సమయానికి సుమారు వెయ్యికి పైగా ప్రయాణీకులు లాహోర్, పెషావర్ విమానాశ్రయాల్లో ఉన్నారు. అనూహ్యంగా దాడి జరగడంతో పాకిస్థాన్ ఉన్నపళంగా ఎయిర్ బేస్ మూసి వేసి విమానాలను రద్దు చేసింది. ఇక్కడ తెల్లవారుజాము 2:30గంటలకు దిగాల్సిన లుఫ్తాన్సాతో సహా పలు విమానాలను ఎయిర్ కంట్రోల్ విభాగం దారి మళ్లించింది. ఇక్కడి నుంచి ఆ తర్వాత మొదలవ్వాల్సిన విమానాలన్నింటినీ రద్దు చేసి ప్రయాణీకులను ఎయిర్ పోర్టుల్లోనే ఉంచింది.
అయితే, ఎయిర్ బేస్ మూసివేయడంతో కొందరు ప్రయాణీకులు ఇళ్లకు వెళ్లగా.. మరికొందరు రోడ్డు మార్గంలో ఇరాన్ చేరుకుని అక్కడి నుంచి లండన్, దుబాయ్ పారిపోయారని సమాచారం.
దాటేందుకు దారులు వెతుక్కుంటున్నారు!
సెలవులపై యూకే, యూరోప్ దేశాల నుంచి పాకిస్థాన్ వచ్చిన పౌరులంతా హుటాహుటిన తిరుగుప్రయాణమయ్యారని తెలుస్తోంది. లండన్‌లో మాస్టర్స్ చేస్తున్న హంజా హుస్సేన్ ఈనెల 1వ తేదీన 15 రోజుల సెలవులపై తన స్వస్థలం లాహోర్‌కు వచ్చారు. భారత్ దాడి గురించి తెలియడంతో ఇంట్లో వాళ్లు బలవంతం చేసి ఆరో తేదీ ఉదయాన్ని విమానమెక్కించేశారు. కొంతమంది పౌరులు, రాజకీయ పార్టీల నేతలు టోర్కం సరిహద్దు మార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ ఎయిర్‌పోర్టును ఆశ్రయిస్తున్నారని సమాచారం. తాఫ్తాన్ వైపునున్న వారు ఆ మార్గం ద్వారా ఇరాన్ చేరుకుని తెహ్రాన్ విమానాశ్రయం నుంచి వివిద దేశాలకు వెళ్తున్నారు. ఇంకొందరు ఖంజెరాబ్ మార్గం ద్వారా చైనాలోకి ప్రవేశించినట్లు సమాచారం.