
Hyderabad: చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) అన్నారు. కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రమూకలు తీసిన ప్రాణాలకు బదులుగా నిన్న ఆర్ధరాత్రి దాడులతో భారత్ ధీటైన జవాబు చెప్పిందన్నారు. భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్న వేళ.. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి యావత్ జాతి మద్దతిస్తోందన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలని కోరిన పవన్.. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
భారత సైన్యాన్ని కించపరచినా… దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా మాట్లాడినా చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నాయకులపై(Congress Leaders) పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. దేశం ఉగ్రవాదంపై చేస్తున్న పోరుపై కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని.. వారు తమ వైఖరి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు పవన్.