India-Pakistan: పాకిస్థాన్‌పై భారత్ దాడి లాంఛనమేనని ఆ దేశం గట్టిగా నమ్ముతోంది. కశ్మీర్(Kashmir) పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత కేంద్ర ప్రభుత్వం సైలెంట్ గా పావులు కదుపుతుండటంతో ఆ దేశాధినేతల మొదలుకొని, మంత్రులు, అధికారులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బహిరంగంగానే రోజుకో ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఆ దేశ రాయబారి అబ్దుల్ బాసిత్(Abdul Basith) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.

ఈనెల 10, 11 తేదీల్లో పాకిస్థాన్‌పై భారత్ తొలి దాడి చేస్తుందని. దీనికి పాకిస్థాన్ ధీటైన బదులివ్వడంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలవుతుందని జోస్యం చెప్పారు అబ్దుల్ బాసిత్. 7వ తేదీన దేశవ్యాప్తంగా మిలిటరీ మాక్ డ్రిల్ జరుగుతుండగా బాసిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందని.. పాకిస్థాన్ ఎప్పుడో సిద్ధంగా ఉందని ఆయన తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో రాసుకొచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో రెండు రోజుల్లో ముగుస్తాయని.. రష్యా విజయోత్సవ వేడుకలు(Russia Victory) ముగిసిన వెంటనే ఇండియా దాడికి తెగబడుతుందన్నారు. అయితే, పహల్గాం దాడి రోజున ఇదే బాసిత్.. ఈ ఘటనతో కశ్మీర్, పాకిస్థాన్-భారత్ ల మధ్య ప్రధాన సమస్యగా ప్రపంచానికి తెలిసిందని. ఈ సమస్య తీరేంత వరకూ ఆసియా దేశాల్లో శాంతి సాధ్యం కాదని రాసుకొచ్చారు. తర్వాతి రోజునే భారతీయ మీడియాపై అవాకులు చెవాకులు పేలిన బాసిత్.. ఇక్కడి మీడిమా వార్తల కవరేజీలో చాలా పాఠాలు నేర్చుకోవాలన్నారు.