ఏపీ ప్రభుత్వ విప్లవాత్మక మార్పు

Amaravathi: రేషన్ కార్డుల జారీలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం విప్లవాత్మక మార్పు తీసుకొస్తోంది. దేశంలోనే తొలిసారి ఏటీఎం కార్డు మాదిరిలో, అదే పరిమాణంలో రేషన్ కార్డులను రైస్ కార్డులుగా(Smart Rice Card) అందజేయనుంది. ఇందుకు రేపు(బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిపింది. ఈమేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రేపటి నుంచి గ్రామ సచివాలయాల్లో ఆరు సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. నూతన రైస్ కార్డుల జారీ, ఒక కుటుంబంలో కొత్తగా పెళ్లైన దంపతులకు కార్డుల విభజనకు అవకాశం కల్పించనున్నారు. కార్డుల్లో చిరునామా మార్చుకునేందుకు, కొత్త సభ్యులను చేర్చుకునేందుకు, ఉన్నవారిని తొలగించేందుకు కూడా ఈ కేంద్రాల్లో సేవలందుతాయన్నారు. పాత కార్డులను సరెండర్ చేయొచ్చని తెలిపారు. వారం రోజుల తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయని.. స్మార్ట్ కార్డుల రూపంలో ఈ రైస్ కార్డులను జూన్ నెలలో పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.