
Hyderabad: పిల్లల కోసం ఓ కుటుంబం చేసిన ఏడేళ్ల నిరీక్షణ, కలల్ని తన నిర్లక్ష్యంతో చిదిమేసిందో వైద్యురాలు. తాను అందుబాటులో లేకున్నా కాసుల కక్కుర్తికి వాట్సాప్ వీడియో కాల్(Whatsapp video call) లో వైద్యం చేసి ఇద్దరు శిశువులను కళ్లు తెరవకముందే బలి తీసుకుంది. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మీ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన.
ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేశ్, కీర్తిలకు ఏడేళ్ల కిందట వివాహం జరిగినా.. సంతానం కలగక పోవడంతో ఇక్కడి విజయలక్ష్మి ఆసుపత్రిలో(Vijayalaxmi Hospital) డాక్టర్ అనూషారెడ్డి దగ్గర వైద్యం చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో.. గర్భిణిని వేరే ఆసుపత్రికి పంపకుండా నర్సుకు వీడియో కాల్ ద్వారా సూచనలు అందించింది డాక్టర్ అనూష.
వైద్యం వికటించడంతో గర్భంలో ఉన్న ఇద్దరు మగ శిశువులు మృతి చెందారు. అనంతరం గర్భిణి వల్లే ఇలా జరిగిందని బుకాయించి చికిత్సకు రూ.30 వేలు చెల్లించాలని బాధితులను ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. దీంతో ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర రావు విచారణ జరిపి ఆసుపత్రిని సీజ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ సంతానం కోసం ఏడేళ్ల నుంచి రూ.15లక్షల వరకూ ఖర్చు చేశామని దంపతులు వాపోతున్నారు.