
Tollywood: సినిమాల్లో మా 90’s జనరేషనే వేరు.. అప్పటి సినిమాలు, ఆ పాటలు.. ఇప్పుడెక్కడివి.. అంటూ ఆపాత మధురాల్ని తరచూ నెమరేసుకునే సినిమా ప్రేమికులకు మే నెల మొత్తం కచ్చితంగా పండగే. వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి తమ ఫేవరేట్ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూడటమంటే, అదీ ఇప్పటి టెక్నాలజీతో మళ్లీ రీ ఎడిట్ అయిన సినిమాలైతే.. పండగ కాకుండా ఇంకేమవుతుంది..?
ఈ వేసవికి హిట్-3(Hit-3) మినహాయించి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలేవీ లేవు. విడుదలకూ కొత్త సినిమాలేం లేకపోవడంతో గతంలో సంచలన విజయాల్ని అందించిన 8 సినిమాల్ని రీరిలీజ్ చేసేస్తున్నారు నిర్మాతలు.
ఈనెల 9న మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) విడుదల అవుతుండగా.. తర్వాతి రోజునే బన్నీ నటించిన దేశముదురు(Desha Muduru), మే 16న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాసిక్ హిట్ జల్సా(Jalsa), మే 18న యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ(Yamadonga), మే 23న ప్రభాస్ నటించిన వర్షం(Varsham), మే 30న త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా(Khaleja), మే 30నే మహేష్ బాబు బ్రహ్మోత్సవం(Brahmotsavam), మే 31న అతిథి(Athithi) సినిమాలు మరోసారి తెరమీదికి రానున్నాయి. ఇంకేం.. అప్పటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుంటూ, ఈ కొత్త తరానికి ఆపాత మధురాలను పరిచయం చేయండి.