Vijayawada: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. మూడు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన మద్యం కుంభకోణం(Liquor scam) రోజుకో మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్, వైకాపా, ఆమ్ఆద్మీ పార్టీలు కలిసి కుంభకోణం చేశాయన్న ఆరోపణలతో దిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal) సహా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు ఏపీలో పలువురు వైకాపా నేతలు అరెస్టైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నేతలకూ దానితో సంబంధాలున్నాయంటూ విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని (MP Kesineni Nani) చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

అయితే, ఆ ట్వీట్లో పేర్కొన్న నిందితుడు నాని సోదరుడు, ప్రస్తుత విజయవాడ ఎంపీ చిన్నీ(కేశినేని శివనాథ్ Kesineni Chinni, Shivanath) కావడం ఆసక్తికరంగా మారింది. ఏపీ పోలీసులు ఇటీవలె అదుపులోకి తీసుకున్న నిందితుడు రాజ్ కేసిరెడ్డితో చిన్నికి నేరుగా సంబంధాలున్నాయంటూ నాని.. ఎక్స్ వేధికగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశాడు. తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కోరిన నాని.. చిన్నీ భార్య జానకి లక్ష్మీ కి సంబంధించిన ఇషాన్వి ప్రాజెక్టు సంస్థలో రాజ్‌తో పాటు పలువురు నిందితులు భాగస్వాములని.. హైదరాబాద్, దుబాయ్, అమెరికా కేంద్రంగా వీరు రియల్ ఎస్టేట్ తో సహా పలు వ్యాపారాల్లో కలిసే పనిచేస్తున్నారంటూ సంస్థల పేర్లను రాసుకొచ్చారు నాని. ఇప్పుడు ఈ వివాదం ఏపీ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపుతోంది. అయితే, ఈ ఇద్దరు అన్నదమ్ములు సామాజిక మాధ్యమాల మీద ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఇదే మొదటి సారి కాదు.. ఎన్నికల ముందు కుటుంబాలను సైతం విమర్శల్లో భాగం చేయడం గమనార్హం.