Telangana: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల (Mancherial) జిల్లా బెల్లంపల్లికి సమీపంలో 3.8 తీవ్రతతో మంగళవారం స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంపం(Earth Quake) ప్రభావం జగిత్యాల(Jagtial), పెద్దపల్లి(Peddapalli), కోరుట్ల ప్రాంతాల దాకా కనిపించింది. భూమి మూడు సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 6:25 గంటలకు భూమి కంపించినట్లు సమాచారం. ఈ భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇటీవల, 2024 డిసెంబర్ 4న ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గత 55 ఏళ్లలో తెలంగాణాలో నమోదైన రెండో అతి పెద్ద భూకంపంగా అధికారులు నిర్ధారించారు. దీని ప్రభావం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్పంగా కనిపించింది.
సాధారణంగా తెలంగాణా రాష్ట్రం భూకంప ప్రమాదాలకు ఆస్కారం లేని రాష్ట్రం. అయితే, గోదావరి రిఫ్ట్ వ్యాలీ కారణంగా అప్పుడప్పుడూ ఇలాంటి స్వల్ప కంపనలు సాధ్యమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.