మ‌ళ్లీ గిల్లుతోన్న ‘అల్లు’డు!

Share this article

Allu Arjun: పుష్ప(pushpa) సినిమాతో ప్ర‌పంచ స్థాయి గుర్తింపు పొందిన న‌టుడు అల్లు అర్జున్.. త‌న న‌ట‌న‌తోనే కాదు, న‌డ‌వ‌డిక‌తోనూ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. కొంత కాలంగా మెగా కుటుంబం నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చి సొంతంగా త‌న‌ ఇంటిపేరును నిల‌బెట్టుకునేందుకు విప‌రీత ప్ర‌య‌త్నాలు చేస్తున్న అర్జున్‌.. అల్లు ఆర్మీ ప్ర‌క‌ట‌న‌, సినిమా వేదిక‌ల‌పై మీద ప్ర‌సంగాల‌తో వివాదాల‌కెక్కారు. అయితే, గ‌త కొంత కాలంగా మెగా కుటుంబం ప్ర‌త్యేకంగా చెప్ప‌ను బ్ర‌ద‌ర్ డైలాగ్ టైం నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్‌తో త‌ర‌చూ గొడ‌వ‌ల్లో నిలుస్తున్న అల్లు అర్జున్‌.. ఇప్పుడ మ‌రోసారి క‌ళ్యాణ్ అభిమానులు, జ‌న‌సైనికుల్ని(Janasena) రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

మొన్న‌టి ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీ, తెదేపాతో పొత్తుతో బ‌రిలో దిగిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కోసం మెగా కుటుంబంతో పాటు టాలీవుడ్‌లో చాలామంది హీరోలు మ‌ద్ద‌తు తెలిపారు. బ‌హిరంగంగా ప్ర‌క‌టన‌లు, ప్ర‌చారం చేశారు. కానీ, అందరిదీ ఓ దారి, త‌న‌దో దార‌న్న‌ట్టు అల్లు అర్జున్ మాత్రం జ‌న‌సేనకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌క‌పోగా.. నంద్యాల‌లో వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన శిల్పా ర‌వికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేశాడు. దీంతో తీవ్ర విమ‌ర్శ‌ల‌ను మూట గ‌ట్టుకున్న అర్జున్‌.. అత‌ను త‌న ఫ్రెండ్ కాబ‌ట్టే వెళ్లాన‌ని, ఇంకే ఉద్దేశం త‌న‌కు లేద‌ని స‌ర్దిచెప్పుకొచ్చాడు. దీన్ని స‌రిదిద్దేందుకు అర్జున్ తండ్రి నిర్మాత అర‌వింద్ జ‌న‌సేన నేత‌ల వెంబ‌డే ఎన్నిక‌ల ఆసాంతం నిల‌బ‌డినా జ‌న‌సైనికులు ఖాత‌రు చేయ‌లేదు.

ఆ త‌ర్వాత పుష్ప విడుద‌ల స‌మ‌యంలో సంధ్య థియేట‌ర్ తొక్కిసాల‌టలోనూ అర్జున్‌ను అరెస్టు చేసి తీరాల‌ని జ‌న‌సైనికులు ప‌ట్టుబ‌ట్టారు. అత‌న్ని టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు, ట్రోలింగులు చేశారు.

అయితే, రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్‌పోర్టులో ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ టీష‌ర్టుతో ద‌ర్శ‌న‌మిచ్చాడు బ‌న్నీ. దీనికి చాలామంది ఫ‌న్నీగానే తీసుకున్నా.. జ‌న‌సైనికులు మాత్రం అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. ఇటీవ‌ల జ‌న‌సేన గెలిచి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేపట్టిన త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులు ‘డిప్యూటీ సీఎం గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూక’ టీష‌ర్టులు ధ‌రించ‌డం, బండ్లు, ఆటోలు, కార్ల మీద రాయించుకోవ‌డం వైర‌ల్ గా మారింది. ఇప్పుడు అర్జున్ ధ‌రించిన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా దాన్ని పోలి ఉండ‌టంతో.. కావాల‌నే రెచ్చ‌గొట్టేందుకు ఇలా చేశాడంటూ బ‌న్నీపై మండిప‌డుతున్నారు జ‌న‌సేనాని ఫ్యాన్స్‌.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *