Kadapa: సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్(Retirement) సమయంలో వారి సేవలకు గుర్తింపుగా ఆర్థిక సాయమో, విలువైన బహుమానాలో అందించడం అంతటా సాధారణమే. కడప(Kadapa)కు చెందిన ఓ కాలేజ్ సైతం ఇదే చేసింది. ఓ ఉద్యోగి రిటైర్మెంట్‌కి ఆర్థిక సాయం అందించడంతో పాటు.. హ్యాపీ రిటైర్‌మెంట్ అంటూ ఆ ఉద్యోగి ఫొటోను కాలేజీ నోటీస్ బోర్డులో అంటించి అదే ఫొటోను సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు అదే పోస్ట్ వైరల్‌గా మారింది. ఇంతకీ అందులో ఏముందంటే.. ఆ ఉద్యోగి కాలేజీలో ఇరవై ఏళ్లకు పైగా సేవలందించిన ఓ స్వీపర్.

ఉన్నత స్థాయి ఉద్యోగుల విషయంలో సంస్థలు ఇలా చేస్తుంటాయి. కానీ, కడపకు చెందిన కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్(KSRM Engineering College) మాత్రం అక్కడ పనిచేస్తున్న స్వీపర్ ఎల్లమ్మకు విశేష గౌరవాన్ని అందించింది. ఈ అరుదైన సంఘటనే ఇప్పుడు ఆ కాలేజ్ పై ప్రశంసలకు కారణమైంది. ప్రతిరోజూ కాలేజీకి వచ్చే విద్యార్థులను పలకరించడం, అందరితో ఆప్యాయంగా ఉంటుందని.. ప్రతి విద్యార్థికి కుటుంభంలో ఓ సభ్యురాలిలాగే ఉంటుందని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.